గతంలో తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ టయోటా కారు పూడ్చివేత... తాజాగా తవ్వితీసిన తాలిబన్లు

  • అమెరికాపై 9/11 దాడులు
  • ఆఫ్ఘన్ లో అల్ ఖైదా నేతలను వేటాడిన అమెరికా
  • తాలిబన్లపైనా అగ్రరాజ్యం ఆగ్రహం
  • పారిపోయేందుకు కారును ఉపయోగించిన ముల్లా ఒమర్
అప్పట్లో అమెరికాపై 9/11 దాడుల తర్వాత ఉగ్రనేతలు చాలామంది ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో తలదాచుకున్నారు. దాంతో అమెరికా సేనలు అల్ ఖైదా నేతలపైనే కాదు.. వారిని తమకు అప్పగించడానికి నిరాకరించిన తాలిబన్ అగ్రతనేలపైనా పోరు కొనసాగించాయి. తాలిబన్ ప్రభుత్వాన్ని తొలగించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో, అమెరికా దళాల నుంచి తప్పించుకునేందుకు అప్పట్లో తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ ఓ టయోటా కరొల్లా కారును ఉపయోగించేవాడు. 

అమెరికా దాడులు తీవ్రతరం కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, ఆయనకిష్టమైన తెల్లరంగు టయోటా కారును 2001లో జబూల్ ప్రావిన్స్ లోని ఓ గ్రామంలో ఉన్న తోటలో పూడ్చివేశారు. ఆ కారును అలాగే వదిలేస్తే దాన్ని కోల్పోతామేమోనని నాడు ఆ కారును గొయ్యి తీసి అందులో పూడ్చారు. అయితే, ఆ కారును ఇన్నాళ్లకు తవ్వితీశారు. ఇప్పుడా కారును రాజధాని కాబూల్ లో ఓ మ్యూజియంలో పెడతారట.

ఆ పాత టయోటా కారు ముందు భాగం కొంచెం దెబ్బతినడం తప్ప, ఇప్పటికీ మంచి కండిషన్ లోనే ఉందని తాలిబన్లు చెబుతున్నారు. ఇది ఎంతో గొప్ప చారిత్రక కళాఖండం అని, అందుకే దీన్ని మ్యూజియంలో ప్రదర్శిస్తామని తాలిబన్ నేతలు వెల్లడించారు. కాగా, ముల్లా ఒమర్ 2013లో ఓ స్థావరంలో దాగి ఉండగా, అమెరికా దళాలు మట్టుబెట్టినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆయన మృతిని తాలిబన్లు అనేక సంవత్సరాలు పాటు బాహ్యప్రపంచానికి తెలియనివ్వలేదు. 
.


More Telugu News