సఫ్రాన్ కంపెనీని హైదరాబాదుకు తీసుకురావడానికి కేటీఆర్ పడిన కష్టాన్ని వివరించిన జయేశ్ రంజన్
- హైదరాబాద్‌లో సఫ్రాన్ యూనిట్‌ను ప్రారంభించిన కేటీఆర్
- సఫ్రాన్ కంపెనీతో కేటీఆర్ 35 సమావేశాలు నిర్వహించారన్న జయేశ్ రంజన్
- 4 ఏళ్లుగా శ్రమించిన కేటీఆర్ సఫ్రాన్‌ను రప్పించారని వెల్లడి
విమానాల మెయింటెనెన్స్, రిపేరీ రంగంలో అగ్రగామిగా ఎదిగిన సఫ్రాన్ కంపెనీ యూనిట్‌ను గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ యూనిట్ సఫ్రాన్‌కు చెందిన అన్ని యూనిట్లలోకి అతి పెద్దదిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ కంపెనీని హైదరాబాద్ తీసుకురావడానికి కేటీఆర్ ఎంతగానో శ్రమించారు. ఈ విషయాన్ని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో నిత్యం కేటీఆర్ వెన్నంటే సాగిన సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
సఫ్రాన్ తన యూనిట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే దిశగా ఆ కంపెనీతో కేటీఆర్ 35 సార్లు భేటీ అయ్యారని రంజన్ తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, పారిస్‌లలో జరిగిన ఈ భేటీల్లో తెలంగాణ తరఫున కేటీఆర్ పాల్లొనగా... ఆయన వెంట రంజన్ కూడా పాలుపంచుకున్నారు. నాలుగేళ్ల నాడు ఈ భేటీలను కేటీఆర్ మొదలుపెట్టారని కూడా రంజన్ తెలిపారు. ఇక భేటీల తర్వాత ఆయా అంశాలపై ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు సఫ్రాన్ కంపెనీల మధ్య ఏకంగా 400లకు పైగా ఈ మెయిళ్లను పరస్పరం పంచుకున్నారట. ఇంతటి కఠోర శ్రమతోనే సఫ్రాన్ కంపెనీని కేటీఆర్ హైదరాబాద్‌కు తీసుకురాగలిగారని రంజన్ తెలిపారు.