ఎయిర్ అంబులెన్స్ లో ఎయిమ్స్‌కు లాలూ ప్ర‌సాద్‌ త‌ర‌లింపు

  • ఆదివారం మెట్ల‌పై నుంచి ప‌డ‌టంతో భుజానికి ఫ్రాక్చ‌ర్‌
  • ఇప్ప‌టికే కిడ్నీస‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్న లాలూ
  • వైద్య ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌న్న బీహార్ ముఖ్య‌మంత్రి 
బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు భుజం విర‌గ‌డంతో బాధ ప‌డుతున్న లాలూను మెరుగైన చికిత్స కోసం బుధవారం రాత్రి ఎయిర్‌ అంబులెన్స్‌లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. 

లాలూ ప్ర‌సాద్ ఆదివారం తన నివాసంలో మెట్లపై నుంచి పడిపోవడంతో ఆయ‌న కుడి భుజం ఎముక విరిగింది. దాంతో, కుటుంబ సభ్యులు ఆయనను పాట్నాలోని పరాస్ ఆసుప‌త్రిలో చేర్చించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌కు తీసుకెళ్లిన‌ట్టు ఆయ‌న కుమారుడు తేజ‌స్వి యాద‌వ్ తెలిపారు. అవసరమైతే చికిత్స కోసం సింగపూర్ కు తరలిస్తామని కూడ ఆయన చెప్పారు. రాజ్యసభ సభ్యురాలు, ఆయన పెద్ద కుమార్తె మీసా భారతి లాలూతోనే ఉన్నారు. ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, చిన్న కుమారుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ విమానంలో ఢిల్లీ చేరుకున్నారు.

కాగా, లాలూ చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భ‌రిస్తుంద‌ని బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ చెప్పారు. బుధ‌వారం పాట్నాలోని పరాస్ ఆసుప‌త్రికి వెళ్లి లాలూను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. ఆయ‌న త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.


More Telugu News