‘కాళీ’ పోస్టర్‌ను తొలగించిన ట్విట్టర్.. కెనడా మ్యూజియం క్షమాపణ

  • దర్శకురాలు లీనా షేర్ చేసిన పోస్టర్‌పై దుమారం
  • హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్న పోస్టర్‌పై సర్వత్ర ఆగ్రహం
  • భారత హైకమిషన్ సూచనతో దిగొచ్చిన ఆగాఖాన్ మ్యూజియం
  • టీఎంసీ ఎంపీ మెహువా మొయిత్రాపై కేసు నమోదు
హిందువులు అమితంగా పూజించే కాళికామాతను అవమానించేలా ఉన్న పోస్టర్‌ను ట్విట్టర్ తొలగించింది. ఈ పోస్టర్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో మైక్రోబ్లాగింగ్ సైట్ ఈ నిర్ణయం తీసుకుంది. అమ్మవారు ఓ చేత్తో ధూమపానం చేస్తున్నట్టుగా, మరో చేత్తో స్వలింగ సంపర్కుల జెండా పట్టుకున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్‌ను కెనడాలో వుంటున్న కేరళకు చెందిన దర్శకురాలు లీనా మణిమేకలై ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

మరోవైపు ‘కాళి’ డాక్యుమెంటరీ పోస్టర్‌ను విడుదల చేసిన కెనడాలోని ఆగాఖాన్ మ్యూజియం క్షమాపణలు తెలిపింది. రెచ్చగొట్టేలా ఉన్న ఈ పోస్టర్‌ను వెంటనే తొలగించాలన్న భారత హైకమిషన్ సూచనతో దీనిని తొలగించింది. ఈ పోస్టర్ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని హిందూ సమాజం నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.

కాగా, లీనాపై ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో కేసులు నమోదయ్యాయి. మరోవైపు, కాళీమాత మధుమాంస భక్షిణి అన్న టీఎంసీ ఎంపీ మెహువా మొయిత్రాపైనా కేసు నమోదైంది. ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ కోల్‌కతాలో బీజేపీ సారథ్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేయడంతోపాటు అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.


More Telugu News