వయసు 86 ఏళ్లు.. 65 ఏళ్లుగా ఒకే రూట్​ లో ఎయిర్​ హోస్టెస్​.. ఎందుకో తెలుసా?

వయసు 86 ఏళ్లు.. 65 ఏళ్లుగా ఒకే రూట్​ లో ఎయిర్​ హోస్టెస్​.. ఎందుకో తెలుసా?
  • 1957లో అమెరికన్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా చేరిన బెట్టీ
  • న్యూయార్క్ – బోస్టన్ రూట్ లో ఇన్నేళ్లుగా సేవలు
  • వికలాంగుడైన కుమారుడిని చూసుకునేందుకు తల్లి త్యాగం
చిన్న వయసులో ఉద్యోగంలో చేరడానికి ముందుకొచ్చేవాళ్లు తక్కువ. కాస్త లైఫ్ ను ఎంజాయ్ చేద్దామని అనుకుంటుంటారు. ఇక 60 ఏళ్లు దాటిందంటే రిటైర్మెంట్ కే మొగ్గు చూపే వాళ్లు ఎక్కువ. ఇన్నేళ్లు కష్టపడ్డాం, ఇకనైనా విశ్రాంతి తీసుకుందామనుకునే ఆలోచనే దానికి కారణం. 

కానీ అమెరికాలోని మసాచుసెట్స్ కు చెందిన ఓ పెద్దావిడ మాత్రం.. 21 ఏళ్ల వయసులోనే ఉద్యోగంలో చేరి.. 86 ఏళ్లు వచ్చినా ఇంకా ఉద్యోగం చేస్తోంది. అది కూడా ఎయిర్ హోస్టెస్ గా చేయడం, అందులోనూ ఒకే సంస్థలో దాదాపు 65 ఏళ్లుగా పనిచేస్తుండటం విశేషం. ఆమె పేరు బెట్టీ నాష్. ఈ ఘనతతో ఆమె గిన్నిస్ బుక్ రికార్డు కూడా సాధించారు.

ఆమెకు ఎందరో ఫ్యాన్స్ 
మామూలుగా ప్రైవేటు ఉద్యోగులు ఐదారేళ్లకుపైగా ఒకే కంపెనీలో పనిచేయడం తక్కువ. కొందరు పది, ఇరవై ఏళ్ల పాటు పనిచేయడం జరుగుతుంది. కానీ బెట్టీ నాష్ అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థల్లో 65 ఏళ్లుగా, ఒకే రూట్‌లో సేవలు అందిస్తుండటం గమనార్హం. ఆమె 1957లో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌లో తొలిసారి ఎయిర్‌ హోస్టెస్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది. ఇన్నేళ్లుగా న్యూయార్క్‌, వాషింగ్టన్‌ మధ్య విధులు నిర్వర్తిస్తోంది. ఆమె ప్రయాణికుల పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తారని పేరుంది. ఆ మార్గంలో తరచూ ప్రయాణించే చాలా మంది ఆమెకు ఫ్యాన్స్ గా మారిపోయారు.

కొడుకు కోసం ఇన్నేళ్లుగా..
ఇన్నేళ్లుగా బెట్టీ నాష్ ఒకే కంపెనీలో, ఓకే రూట్ లో  పనిచేయడానికి ఒక కారణం ఉంది. ఆమె కుమారుడు అంగ వైకల్యంతో బాధపడుతుండటంతో.. అతడికి తల్లి సేవలు అవసరం. తాను న్యూయార్క్ – వాషింగ్టన్ రూట్ లో పనిచేస్తే.. రాత్రికల్లా ఇంటికి వచ్చేసి కుమారుడిని చూసుకోవచ్చని భావించింది. ఎయిర్ లైన్స్ అధికారులు కూడా ఆమె మంచితనానికి, విధి నిర్వహణలో నిబద్ధతకు మెచ్చి.. అలా కొనసాగించేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో ఎందరో పైలట్లు, సిబ్బంది, అధికారులు మారిపోయారు. ఆమె మాత్రం అలాగే ఎయిర్ హోస్టెస్ గా కొనసాగుతూ వస్తున్నారు.


More Telugu News