మహారాష్ట్రలో ముస్లిం మత పెద్దను కాల్చి చంపిన దుండగులు

  • 35 ఏళ్ల ఖ్వాజా సయ్యద్ చిస్తీని కాల్చి చంపిన దుండగులు
  • డ్రైవర్ ను అనుమానిస్తున్న పోలీసులు
  • భూ వ్యవహారమే కారణమై ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు
మహారాష్ట్రలోని నాసిక్ లో దారుణం చోటు చేసుకుంది. 35 ఏళ్ల ముస్లిం ఆధ్యాత్మికవేత్త ఖ్వాజా సయ్యద్ చిస్తీని కాల్చి చంపారు. తుపాకీతో పాయింట్ బ్లాంక్ లో ఆయనను కాల్చి చంపారు. తలలోకి బుల్లెట్లు దిగడంతో... ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సయ్యద్ చిస్తీని హత్య చేసిన వెంటనే ఎస్యూవీ వాహనంలో హంతకులు పరారయ్యారు. ఆయన డ్రైవరే ఆయనను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సూఫీ బాబాగా చిస్తీకి స్థానికంగా చాలా పేరుంది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ఈయన చాలా సంవత్సరాలుగా నాసిక్ లో ఉంటున్నారు. ఈ హత్యకు మతపరమైన కారణాలు ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒక స్థలానికి సంబంధించి ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. 

ఆఫ్ఘనిస్థాన్ పౌరుడు కావడంతో మన దేశంలో ఆయన భూమిని కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో.. స్థానికుల సహకారంతో కొంత భూమిని ఆయన సేకరించారని చెప్పారు. ఈ భూ వ్యవహారమే హత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు చిస్తీ డ్రైవర్ పేరును సాక్షులు చెప్పడంతో... ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు పోలీసు అధికారి సచిన్ పాటిల్ తెలిపారు.


More Telugu News