‘నుపుర్ శర్మ’ వ్యవహారంలో సుప్రీంకోర్టు జడ్జీలు పరిమితులు దాటారు: మాజీ జడ్జీలు, అధికారుల బహిరంగ లేఖ

  • సాయుధ దళాల అధికారులు, బ్యూరోక్రాట్ల సంతకాలు
  • మద్దతు పలికిన 117 మంది 
  • దిద్దుబాటు చర్యలు అవసరమన్న అభిప్రాయం  
నుపుర్ శర్మ తన నోటి దురుసుతో మహమ్మద్ ప్రవక్తను కించపరిచి, దేశాన్ని అస్థిరంగా మార్చారని.. ఈ మొత్తానికి ఆమె ఒక్కరే బాధ్యురాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. ఈ విషయంలో దేశానికి క్షమాపణ కోరాలని ఆమెను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. 

ఈ అంశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ లక్ష్మణ రేఖ దాటినట్టు మాజీ న్యాయమూర్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు వారు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. దీనిపై 117 మంది సంతకాలు చేశారు. వీరిలో మాజీ న్యాయమూర్తులతో పాటు, సాయుధ దళాల అధికారులు, బ్యూరోక్రాట్లు కూడా ఉన్నారు.

‘‘అన్ని సంస్థలూ రాజ్యాంగం ప్రకారం వాటి బాధ్యతలు నిర్వహించినప్పుడే ఏ దేశ ప్రజాస్వామ్యం అయినా నిలిచి ఉంటుందని పౌరులుగా మేము భావిస్తున్నాం. గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జీలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు లక్ష్మణ రేఖను దాటాయి. అందుకే మేము బహిరంగ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది’’ అని వారి నుంచి ప్రకటన విడుదలైంది.

‘‘ఆమెకు యథార్థంగా న్యాయం నిరాకరించబడింది. దేశంలో జరిగిన దానికి ఆమెను మాత్రమే బాధ్యురాలని పేర్కొనడం సమర్థనీయంగా లేదు. న్యాయవ్యవస్థ చరిత్రలో దురదృష్టకర వ్యాఖ్యలకు మించి మరేదీ ఉండదు. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలు, దేశ భద్రత పట్ల తీవ్ర పరిణామాలు చూపిస్తాయి. కనుక సత్వర దిద్దుబాటు చర్యలు అవసరం’’ అంటూ పలు కీలక అంశాలను వీరు తమ బహిరంగ లేఖలో ప్రస్తావించారు.

తన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నమోదైన కేసులు అన్నింటినీ ఒకే చోటకు బదిలీ చేయాలని కోరుతూ నుపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసనం నుంచి తీవ్ర వ్యాఖ్యలతో ఆమె ఊహించని అనుభవాన్ని ఎదుర్కొన్నారు.


More Telugu News