ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పై దాడి ఘటన.. రఘురామకృష్ణరాజు భద్రతా సిబ్బంది సస్పెన్షన్

  • తమ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించాడంటున్న రఘురాజు 
  • రోడ్డు పక్కనున్న తనను బలవంతంగా కారులో తీసుకెళ్లారన్న కానిస్టేబుల్
  • ఇద్దరిని సస్పెండ్ చేసిన నోయిడా 221 బెటాలియన్ కమాండెంట్
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు నివాసం సమీపంలో విధి నిర్వహణలో వున్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుభానీపై దాడి ఘటన అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. సుభానీ రెక్కీ నిర్వహిస్తున్నాడంటూ రఘురాజు భద్రతా సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 

ఇంట్లోకి చొరబడేందుకు యత్నించిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని రఘురాజు భద్రతా సిబ్బంది చెపుతున్నారు. మరోవైపు, రోడ్డు పక్కనున్న తనను కారులో బలవంతంగా తీసుకెళ్లి, తనపై దాడి చేశారని సుభానీ చెపుతున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాయి.

ఈ నేపథ్యంలో ఘటనకు చెందిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. రోడ్డు పక్కనున్న సుభానీని రఘురామకృష్ణరాజు భద్రతా సిబ్బంది బలవంతంగా కారులోకి తీసుకెళ్తున్నట్టు ఫుటేజీలో కనిపిస్తోంది. ఈ ఘటనపై స్పందించిన నోయిడా 221 బెటాలియన్ కమాండెంట్ సీఆర్పీఎఫ్ కు చెందిన ఇద్దరు భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కు గురైన వారిలో ఏఎస్ఐ గంగారామ్, కానిస్టేబుల్ సందీప్ ఉన్నారు. మరోవైపు రఘురాజు, ఆయన కుమారుడు భరత్, రఘురామ పీఏ శాస్త్రి, ఏఎస్ఐ గంగారామ్, కానిస్టేబుల్ సందీప్ పై గచ్చిబౌలి పీఎస్ లో కేసు నమోదయింది.


More Telugu News