పదేళ్లను పూర్తిచేసుకున్న సాంకేతిక సంచలనం .. 'ఈగ'

  • రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ'
  • 2012 జులై 6వ తేదీన విడుదలైన సినిమా
  • అల్పజీవి చుట్టూ అల్లిన అందమైన ప్రేమకథ  
  • సాంకేతిక పరిజ్ఞానంతో విస్మయులను చేసిన రాజమౌళి 
  • ప్రతినాయకుడిగా మెప్పించిన సుదీప్ 
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో 'ఈగ' స్థానం ప్రత్యేకం. ప్రభాస్ .. ఎన్టీఆర్ .. చరణ్ వంటి హీరోలతో ఆయన చేసిన సినిమాలకు, వాళ్ల క్రేజ్ తోడై ఉండే అవకాశం ఉంది. కానీ 'ఈగ' వంటి ఒక 'అల్పజీవి'ని తీసుకుని దాని చుట్టూ కథను అల్లుకుని తెరపై ఆయన చేసిన ఆవిష్కారం నేటితో పదేళ్లను పూర్తిచేసుకుంది.

వారాహి చలనచిత్ర బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మించిన ఈ సినిమా 2012 జులై 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంటే ఈ రోజుకి ఈ సినిమా విడుదలై పదేళ్లు అయింది. నాని - సమంత నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా కన్నడ స్టార్ సుదీప్ కనిపించాడు. కీరవాణి సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. 

'ఈగ' సినిమాకి ముందుగానీ .. ఆ తరువాతగాని తెలుగు తెరపై అలాంటి ఒక సినిమా రాలేదు. ఈగ ప్రతి కదలికను తెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. రాజమౌళి చేయించిన గ్రాఫిక్స్ ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. స్టార్ హీరోలు లేకపోయినా సంచలన విజయాలను సాధించవచ్చని నిరూపించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు.


More Telugu News