సిరీస్ మాదే​ అంటూ ఇంగ్లండ్​ ఫ్యాన్స్​ పోస్టర్​.. చరిత్రను వక్రీకరించడం మీకు అలవాటే కదా? అంటూ భారత స్పిన్నర్ కౌంటర్​

  • ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం
  • 2-2తో సిరీస్ ను పంచుకున్న భారత్, ఇంగ్లండ్
  • 1-0తో ఇంగ్లండ్ సిరీస్ గెలిచిందని బార్మీ ఆర్మీ ఫేక్ పోస్టర్
భారత జట్టుతో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల  తేడాతో భారత్ ను ఓడించిన ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్ ను 2-2 తో సమం చేసింది. అయితే, బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఆతిథ్య జట్టు 1-0 తో ఈ సిరీస్ ను గెలిచిందంటూ ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అభిమానుల క్లబ్ ‘బార్మీ ఆర్మీ’ ట్విట్టర్ లో ఓ పోస్టు చేసింది. ఇలా తప్పుడు ఫలితాలను సృష్టించిన బార్మీ ఆర్మీ క్లబ్ పై భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మండిపడ్డాడు. తమ స్వలాభం కోసం చరిత్రను వక్రీకరించడం బ్రిటిష్ వారికి అలవాటే అని కౌంటర్ ఇచ్చాడు. 

కాగా, ఐదో టెస్టులో భారత్ ఇచ్చిన 378  పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించిన ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ లో తమ అత్యుత్తమ లక్ష్య ఛేదనను నమోదు చేసింది. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ టెస్టులో 359 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసిన రికార్డును ఇంగ్లండ్ మెరుగు పరుచుకుంది. 

జో రూట్, జానీ బెయిర్‌స్టో అజేయ సెంచరీలతో రాణించడంతో ఆఖరి రోజు, మంగళవారం తొలి సెషన్ లోనే విజయానికి అవసరమైన మరో 119 పరుగులు రాబట్టిన ఆతిథ్య జట్టు సులువుగా గెలిచింది. రెండు ఇన్నింగ్స్ ల్లో శతకాలు చేసిన బెయిర్ స్టో కు ప్లేయర్  ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ లో 737 పరుగులు చేసిన జో రూట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.


More Telugu News