కాళికాదేవిపై టీఎంసీ ఎంపీ మహువా వివాదాస్పద వ్యాఖ్యలు.. ఖండించిన పార్టీ

  • కాళికాదేవి చుట్టూ వరుస వివాదాలు
  • కాళీమాత మధుమాంస భక్షకురాలన్న ఎంపీ మహువా మొయిత్రా
  • ఆమెపై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ
  • తెలుసుకుని మాట్లాడాలంటూ మహువా కౌంటర్
  • ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతమన్న టీఎంసీ
హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవత కాళికాదేవి చుట్టూ వరుస వివాదాలు ముసురుకుంటున్నాయి. మధురైకి చెందిన దర్శకుడు లీనా మణిమేకలై ఓ డాక్యుమెంటరీకి చెందిన పోస్టర్‌ను విడుదల చేసి అగ్గిరాజేశారు. ఆ పోస్టర్‌లో కాళీమాత ధూమపానం చేస్తున్నట్టుగా ఉండడమే కాకుండా ఎల్‌జీబీటీ ప్లస్ (స్వలింగ్ సంపర్కుల) జెండాను చేతపట్టుకున్నట్టుగా ఉంది. ఈ పోస్టర్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆమెను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు. లీనాపై పలు ప్రాంతాల్లో కేసులు కూడా నమోదయ్యాయి.

తాజాగా, ఇదే వివాదంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా స్పందిస్తూ.. కాళికాదేవి మధుమాంసాలను స్వీకరించే దేవతగానే తనకు తెలుసని అన్నారు. కాళీమాత ధూమపానం చేస్తుందో, లేదో తనకు తెలియదని, కానీ ఆమె మధుమాంస భక్షిణి అని అన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం కావడంతో బీజేపీ స్పందించింది. హిందూ మతాన్ని కించపరచడం టీఎంసీకి అలవాటైపోయిందని బీజేపీ నేత సువేందు అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నుపుర్ శర్మపై బీజేపీ చర్యలు తీసుకున్నట్టుగానే మహువాపైనా సీఎం మమతా బెనర్జీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విమర్శలపై మహువా స్పందిస్తూ.. అబద్ధాలతో హిందువులుగా మారలేమంటూ సంఘ్ పరివార్‌పై విరుచుకుపడ్డారు. తాను ఏ పోస్టర్‌కు మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఒకసారి తారాపీఠ్‌లోని కాళీమందిర్‌కు వెళ్తే అసలు విషయం బోధపడుతుందన్నారు. అక్కడ అమ్మవారికి భోగం కింద ఆహార, పానీయాలు ఏమి సమర్పిస్తున్నారో చూసి మాట్లాడాలని ఘాటుగా బదులిచ్చారు. అలాగే, సిక్కింలో కాళికాదేవికి విస్కీ సమర్పిస్తారని, ఉత్తరప్రదేశ్‌లో దానిని దైవదూషణగా భావిస్తారని మహువా వివరించారు.

కాగా, మహువా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీఎంసీ స్పందించింది. ఆమె వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని, అవి ఆమె వ్యక్తిగతమని స్పష్టం చేసింది. అయితే, ఇలాంటి వ్యాఖ్యలను మాత్రం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపింది. కాళీమాతపై ఆమె వెల్లడించిన అభిప్రాయం ఏదైనా పార్టీ వాటిని ఆమోదించదని పునరుద్ఘాటించింది.


More Telugu News