అది మానవ తప్పిదం... ఇప్పుడేం చేయలేం: పీవీ సింధుకు సారీ చెప్పిన బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ

  • ఈ ఏడాది ఏప్రిల్ లో బ్యాడ్మింటన్ ఆసియా టోర్నీ
  • సెమీస్ లో ఓడిన సింధు
  • మ్యాచ్ మధ్యలో సింధు ప్రత్యర్థికి పాయింట్ కేటాయించిన రిఫరీ
  • పుంజుకుని విజయం సాధించిన సింధు ప్రత్యర్థి యమగూచి
క్రీడల్లో రిఫరీలు, అంపైర్లు కూడా మానవ మాత్రులే. వాళ్లు కూడా తప్పిదాలు చేస్తుంటారు. అయితే ఆ తప్పిదాలు కొన్నిసార్లు మ్యాచ్ కోల్పోయేందుకు దారితీయొచ్చు. భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం పీవీ సింధుకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. 

ఈ ఏడాది ఏప్రిల్ లో సింధు బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్ షిప్ టోర్నీలో ఆడింది. అయితే, ఆ టోర్నీలో సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర విమర్శలపాలైంది. సింధు సర్వీస్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటోందంటూ ఆమె ప్రత్యర్థి అకానే యమగూచికి రిఫరీ ఓ పాయింట్ కేటాయించాడు. యమగూచి సిద్ధంగా లేదని భావించి సర్వీస్ చేసేందుకు సమయం తీసుకున్నానని సింధు తన వాదన వినిపించింది. కానీ ఆ రిఫరీ వినిపించుకోలేదు. ఆ తర్వాత యమగూచి పుంజుకుని సింధుపై విజయం సాధించింది. 

కాగా, బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ ఈ అంశంపై తాజాగా స్పందించింది. ఆ మ్యాచ్ లో రిఫరీ చేసింది తప్పేనని కమిటీ అంగీకరించింది. పీవీ సింధుకు క్షమాపణలు తెలుపుకుంటున్నట్టు ఓ ప్రకటన చేసింది. అది మానవ తప్పిదమేనని, కానీ ఇప్పుడు ఏం చేయలేమని విచారం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు పీవీ సింధుకు బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ చైర్మన్ లేఖ రాశారు.


More Telugu News