అసలే ఓటమి, ఆపై జరిమానా... స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడిన టీమిండియా

  • బర్మింగ్ హామ్ లో టీమిండియా ఓటమి
  • నిర్దేశిత సమయానికి ఓవర్ల కోటా పూర్తిచేయని టీమిండియా
  • మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా
  • రెండు ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల కోత
మూలిగే నక్కపై తాటిపండు పడడం అంటే ఇదేనేమో! అసలే ఇంగ్లండ్ చేతిలో ఓటమితో తీవ్ర నిరాశలో టీమిండియాపై స్లో ఓవర్ రేట్ జరిమానా పడింది. బర్మింగ్ హామ్ టెస్టులో నిర్దేశిత సమయానికి 2 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసిందని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ నిర్ధారించారు. దాంతో, టీమిండియా మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత, రెండు ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ పాయింట్లను జరిమానాగా విధించారు. టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ లేకుండా జరిమానాతో సరిపెట్టారు. 

కాగా, ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ నుంచి రెండు పాయింట్ల కోత విధించడంతో టీమిండియా ఖాతాలో ప్రస్తుతం 75 పాయింట్లు ఉన్నాయి. టెస్టు చాంపియన్ షిప్ జాబితాలో టీమిండియా ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. పెనాల్టీ కారణంగా పాకిస్థాన్ జట్టు టీమిండియాను దాటి మూడోస్థానానికి చేరుకుంది. పాకిస్థాన్ పాయింట్ పర్సెంటేజీ (పీసీటీ) 52.38 కాగా, టీమిండియా పీసీటీ 52.08గా ఉంది.
.


More Telugu News