ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శాస్త్రవేత్తను జైలుకు తరలించిన రష్యా... అక్కడే ప్రాణాలు విడిచిన శాస్త్రవేత్త

  • రష్యాలో గత కొంతకాలంగా పలువురు శాస్త్రవేత్తల అరెస్ట్
  • దేశద్రోహులంటూ ముద్ర
  • విదేశాలకు రహస్యాలు చేరవేస్తున్నారని ఆరోపణ
విదేశాలకు కీలక సమాచారం చేరవేస్తున్నారంటూ రష్యన్ శాస్త్రవేత్తలను అరెస్ట్ చేయడం, వారిపై దేశద్రోహం అభియోగాలు మోపడం గత కొన్నేళ్లుగా తరచుగా జరుగుతోంది. కాగా, దిమిత్రీ కోల్కెర్ అనే క్వాంటమ్ భౌతికశాస్త్ర నిపుణుడిని కూడా అదే ఆరోపణపై అరెస్ట్ చేయగా, రెండ్రోజుల అనంతరం ఆయన మృతి చెందారు. 

54 ఏళ్ల దిమిత్రీ కోల్కెర్ పేంక్రియాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. క్యాన్సర్ వ్యాధి బాగా ముదిరిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ ట్యూబ్ ద్వారా ఆహారం అందుకుంటున్నారు. అయితే, గతవారం కోల్కెర్ ను సైబీరియాలోని ఆసుపత్రిలో అరెస్ట్ చేసిన రష్యా అధికారులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకుండా బలవంతంగా మాస్కో తరలించారు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో 4 గంటలకు పైగా ప్రయాణించిన అనంతరం ఆ శాస్త్రవేత్తను లెఫోర్టోవా జైలుకు తరలించారు. అక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు న్యాయవాదులు, కుటుంబ సభ్యులు తెలిపారు. 

కాగా, కోల్కెర్ బంధువు ఆంటోన్ డయనోవ్ అమెరికాలో ఉంటున్నారు. ఆయన రాయిటర్స్ మీడియా సంస్థతో మాట్లాడుతూ, కోల్కెర్ లేజర్ నిపుణుడు అని తెలిపారు. అయితే, తన రహస్య పరిశోధనల సమాచారాన్ని చైనాకు చేరవేశాడంటూ అసంబద్ధమైన అభియోగాలు అతడిపై మోపారని డయనోవ్ ఆరోపించారు. కోల్కెర్ ఓ శాస్త్రవేత్త అని, స్వదేశాన్ని ఎంతగానో ప్రేమించేవాడని తెలిపారు. విదేశాల్లోని అత్యుత్తమ ప్రయోగశాలల నుంచి పిలుపు వచ్చినా, రష్యాలోని విద్యార్థులకు తన విజ్ఞానాన్ని పంచేందుకు స్వదేశంలోనే ఉండిపోయాడని వివరించారు.


More Telugu News