మాట్లాడుతుండ‌గానే సీఎం షిండే నుంచి మైక్‌ను లాగేసుకున్న డిప్యూటీ సీఎం ఫడ్న‌వీస్‌... వీడియో ఇదిగో

  • ఇటీవ‌లే మ‌హారాష్ట్ర సీఎంగా ప‌ద‌వి చేప‌ట్టిన ఏక్‌నాథ్ షిండే
  • డిప్యూటీ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఫ‌డ్న‌వీస్‌
  • మీడియాతో మాట్లాడుతున్న సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియో
మ‌హారాష్ట్ర నూత‌న సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేకు... కీల‌క ప‌ద‌వి చేప‌ట్టిన రోజుల వ్య‌వ‌ధిలోనే షాక్ త‌గిలింది. మీడియాతో మాట్లాడుతున్న సంద‌ర్భంగా షిండే మాట్లాడుతుండ‌గానే... ఆయ‌న మైక్‌ను డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ లాగేసుకున్నారు. సీఎంకు మీడియా ప్ర‌తినిధులు సంధించిన ప్ర‌శ్న‌కు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఫ‌డ్న‌వీస్ స‌మాధానం ఇచ్చారు. తాను మాట్లాడుతుండ‌గానే త‌న ముందున్న మైక్‌ను లాగేసుకున్న ఫ‌డ్న‌వీస్‌ను చూసి షిండేకు నోట మాట రాలేదు. ఫ‌డ్న‌వీస్ వైపు ఓ సారి అలా చూసి మౌనం వ‌హించారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో క్ష‌ణాల్లోనే వైర‌ల్‌గా మారిపోయింది. వాస్త‌వానికి అప్ప‌టికే ఓ రెండు ప‌ర్యాయాలు సీఎంగా ప‌నిచేసిన ఫ‌డ్న‌వీస్ షిండే కేబినెట్‌లో చేర‌కూడద‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ బీజేపీ అధిష్ఠానం సూచ‌న‌తో త‌న‌కు ఇష్టం లేక‌పోయినా ఫ‌డ్న‌వీస్ డిప్యూటీ సీఎం ప‌ద‌విని చేప‌ట్టారు. అంతేకాకుండా 2014లో ఫ‌డ్న‌వీస్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గా...నాడు బీజేపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న శివ‌సేన కూడా ప్ర‌భుత్వంలో భాగ‌స్వామి అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో షిండే కూడా నాడు ఫడ్న‌వీస్ కేబినెట్‌లో ఓ మంత్రిగా ప‌నిచేశారు. 

బీజేపీలో యువ నేత‌గా స‌త్తా చాటిన ఫ‌డ్న‌వీస్ కు అటు రాజ‌కీయంతో పాటు ఇటు ప్రభుత్వ పాల‌న‌లోనూ మంచి ప‌ట్టు ఉంది. మీడియా ప్ర‌శ్న‌ల‌తో పాటు విప‌క్షాల వ్యూహాల‌ను తిప్పికొట్ట‌డంలో ఆయ‌న సిద్ధ‌హ‌స్తుడు. ఈ నేప‌థ్యంలో మీడియా సంధించిన ఓ ప్ర‌శ్న‌కు షిండే త‌డుముకుంటూ ఉంటే.. డిప్యూటీ సీఎంగా ఉన్నా... ఫ‌డ్న‌వీస్ నిభాయించుకోలేక‌పోయారు. షిండే స్థాయిని త‌గ్గించాల‌న్న భావ‌న కాదు గానీ... మీడియా ప్ర‌శ్న‌ల‌కు దీటుగా స‌మాధానం ఇవ్వాల‌న్న భావ‌న‌తో ఆయ‌న మైక్‌ను లాక్కుని ప‌ఢ్న‌వీస్ మీడియాకు ఇలా దొరికిపోయారు.


More Telugu News