స్నేక్ ఐలాండ్ మళ్లీ ఉక్రెయిన్ చేతికి.. ఇది ఎంత కీలకమో తెలుసా?

  • ఇటీవలే స్నేక్ ఐలాండ్ నుంచి వైదొలగిన రష్యా సైనిక దళాలు
  • అతి చిన్న ద్వీపమే అయినా ఆ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాధాన్యం
  • బ్లాక్ సీలో నౌకలు, శత్రువుల కదలికలపై నిఘా పెట్టేందుకు తోడ్పడే స్నేక్ ఐలాండ్
  • 300 వందల ఏళ్లుగా ఈ ద్వీపంపై పట్టు కోసం ఎన్నో దేశాల ప్రయత్నాలు
బ్లాక్ సీలో అత్యంత కీలకమైన స్నేక్ ఐలాండ్ తిరిగి ఉక్రెయిన్ అధీనంలోకి వచ్చింది. ఉక్రెయిన్ పై దాడికి దిగిన రష్యా.. అన్నింటికన్నా ముందు ఈ స్నేక్ ఐలాండ్ పైనే దాడి చేసి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ద్వీపాన్ని తమ అధీనంలోనే ఉంచుకున్న రష్యా సేనలు దాదాపు వారం కింద అక్కడి నుంచి వైదొలిగాయి. 

తాజాగా ఆ ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఆ దేశ దక్షిణ మిలటరీ కమాండ్‌ అధికారి నటాలియా హ్యూమెనియూక్‌ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. స్నేక్ ఐలాండ్ లో సైనిక చర్య పూర్తయిందని, రష్యా దళాలను తరిమికొట్టి ఆ భూభాగాన్ని అధీనంలోకి తెచ్చుకున్నామని ప్రకటించారు. తిరిగి స్నేక్ ఐలాండ్ పై ఉక్రెయిన్ జెండాను ఎగురవేసినట్టు తెలిపారు.

 అతి చిన్న ద్వీపం.. 
 బ్లాక్ సీలో అర కిలోమీటరు పొడవు, అంతకన్నా తక్కువ వెడల్పుతో ఉండే అతి చిన్న ద్వీపం స్నేక్ ఐలాండ్. సముద్ర మట్టం కంటే కేవలం 135 మీటర్లు ఎత్తు మాత్రమే ఉంటుంది. అయితే ఉక్రెయిన్ లో కీలక ఆర్థిక ప్రాంతమైన ఒడెస్సా పోర్టుకు ఇది 140 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం, బ్లాక్ సీలో నౌకల కదలికలపై నిఘా పెట్టేందుకు వీలుండటం ఈ ద్వీపానికి ఉన్న ప్రత్యేకతలు.

మూడు వందల ఏళ్ల చరిత్రతో..
ద్వీపం అతి చిన్నదే అయినా.. దీని కోసం ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. దాదాపు మూడు వందల ఏళ్ల చరిత్ర దీనితో ముడిపడి ఉంది. 1788 జులైలో రష్యాకు, టర్కీ చక్రవర్తికి మధ్య ఈ ద్వీపం కోసం యుద్ధాలు జరిగాయి. అందులో రష్యా గెలిచి ద్వీపాన్ని తన అధీనంలోకి తీసుకుంది. 

ఆ తర్వాత కూడా యుద్ధాలలో రష్యాకు, టర్కీకి మధ్య మారుతూ వచ్చింది. కొన్నేళ్లపాటు రొమేనియా అధీనంలోకి వెళ్లింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ ద్వీపంపై టర్కీ దాడి చేయగా.. రెండో ప్రపంచ యద్ధంలో సోవియట్‌ యూనియన్, రొమేనియాల మధ్య యుద్ధం జరిగింది. 1944లో ఈ ద్వీపం సోవియట్ యూనియన్ అధీనంలోకి వచ్చింది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంతో ఉక్రెయిన్ చేతిలోకి వచ్చింది.

ద్వీపానికి శాపం ఉందా..?
పురాణాల ప్రకారం స్నేక్ ఐలాండ్ గ్రీకు వీరుడు, దేవుడిగా పూజించే అకిలెస్ సమాధి స్థలం అనే ప్రచారం ఉంది. ఆ దేవుడి పేరిట ఆలయం కూడా ఉండేది. 1788లో రష్యా, టర్కీల మధ్య యుద్ధంలో, ఆ తర్వాతి యుద్ధాల సమయంలో, రొమేనియా దాడి చేసినప్పుడు.. ఇలా ప్రతిసారి ఈ ద్వీపాన్ని ఆక్రమించుకున్న దేశాలకు తీవ్రంగా నష్టం జరుగుతూ వచ్చింది. అందుకే ఈ ద్వీపానికి శాపం ఉందేమోనన్న ప్రచారమూ ఉంది.

ఇప్పుడు కూడా స్నేక్ ఐలాండ్ పై దాడి చేసి బాంబులు కురిపించిన రష్యాకు చెందిన మాస్కోవా యద్ధ నౌక కొన్ని రోజుల్లోనే దెబ్బతిని మునిగిపోయింది. దీని సమీపంలోనే రష్యాకు చెందిన ఇతర నౌకలూ దెబ్బతిన్నాయి. ఒక విమానంకూడా కూలిపోయింది.


More Telugu News