4 క్ల‌స్ట‌ర్లుగా తెలంగాణ‌... ఒక్కో క్ల‌స్ట‌ర్‌ను ఒక్కో కేంద్ర మంత్రికి అప్ప‌గించిన బీజేపీ

  • హైద‌రాబాద్‌, జ‌హీరాబాద్‌, వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్ పేరిట క్ల‌స్ట‌ర్లు
  • ఒక్కో క్ల‌స్ట‌ర్‌లో 4 నుంచి 5 లోక్ స‌భ నియోజ‌కవ‌ర్గాలు ఉండేలా విభ‌జ‌న‌
  • హైద‌రాబాద్‌కు సింథియా, జ‌హీరాబాద్‌కు నిర్మ‌ల ఇంచార్జీలు
  • ఇంద్ర‌జిత్ సింగ్‌కు వ‌రంగ‌ల్‌, పురుషోత్త‌మ్‌కు ఆదిలాబాద్‌
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా వ్యూహాలు ర‌చిస్తున్న భార‌తీయ జ‌నతా పార్టీ (బీజేపీ) మంగ‌ళ‌వారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రం మొత్తాన్ని నాలుగు క్ల‌స్ట‌ర్లుగా... అది కూడా 4 నుంచి 5 లోక్ స‌భ నియోజ‌కవ‌ర్గాల‌ను ఓ క్ల‌స‌ర్ట్‌గా విభ‌జించిన బీజేపీ...ఆయా క్ల‌స్ట‌ర్ల‌కు న‌లుగురు కేంద్ర మంత్రుల‌ను ఇంచార్జీలుగా నియ‌మించింది. ఎన్నిక‌ల్లో ఈ ఇంచార్జీలే కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లుగా స‌మాచారం. ఎన్నిక‌ల్లో వీరు పోటీ చేయ‌కున్నా... పార్టీ టికెట్ల కేటాయింపు, అభ్య‌ర్థుల ప్ర‌చారం, బూత్ క‌మిటీల‌ను బ‌లోపేతం చేయ‌డం త‌దిత‌ర అన్ని అంశాల‌ను వీరు స్వయంగా ప‌రిశీలించ‌నున్నారు.

ఇక హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్‌, జ‌హీరాబాద్ పేరిట మొత్తం రాష్ట్రాన్ని బీజేపీ 4 క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించింది. ఇందులో హైద‌రాబాద్ క్ల‌స్ట‌ర్‌కు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియాను ఇంచార్జీగా నియ‌మించింది. ఇక జ‌హీరాబాద్ క్ల‌స్ట‌ర్ బాధ్య‌త‌ల‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్‌కు అప్ప‌గించిన బీజేపీ.. ఆదిలాబాద్ క్ల‌స్ట‌ర్‌కు మ‌రో కేంద్ర మంత్రి పురుషోత్త‌మ్ రూపాల‌ను, వ‌రంగ‌ల్ క్ల‌స్ట‌ర్‌కు రావు ఇంద్ర‌జిత్ సింగ్‌ను నియ‌మించింది.


More Telugu News