ప్రపంచంలోనే అత్యుత్తమ జోక్​ ఇదేనట.. ఎంత నవ్వు వస్తుందో మీరే చూడండి

  • ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసిన ఇంగ్లాండ్ సైకియాట్రిస్ట్
  • 40 వేలకుపైగా జోక్ లకు 20 లక్షల మందికిపైగా రేటింగ్ లు
  • సైంటిఫిక్ ప్రమాణాలకూ సరితూగిన జోక్ ఇదేననే అంచనాలు
  • ఇద్దరు వేటగాళ్లు, హెల్ప్ లైన్ సెంటర్.. ఇవే కీలకంగా హాస్యం
జోక్ అంటే ఏమిటి? చెప్పగానే చటుక్కున నవ్వు వచ్చేసేది. అందరు చెప్పే జోకులు, అన్ని జోకులు నవ్వించలేవు. కొందరు చెప్పే జోకులు వింటుంటే డోకు వస్తుంది కూడా. అంతేకాదు అది ఎంత మంచి జోక్ అయినా చెప్పే వాళ్లను బట్టి, సందర్భాన్ని బట్టి అసలు పేలక పోవచ్చు. మామూలు జోక్ అయినా చెప్పే స్టయిల్ ను బట్టి, సందర్భాన్ని బట్టి పడీ పడీ నవ్వేలా చేయవచ్చు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. అసలు ప్రపంచవ్యాప్తంగా వేలాది భాషల్లో కోట్లాది జోకులు ఉండి ఉంటాయి కదా. మరి అందులో ఎక్కువ మందికి నచ్చే జోక్ ఏమిటనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? మనకేమోగానీ అమెరికాకు చెందిన సైకాలజిస్టు రిచర్డ్ వైస్మ్యాన్ కు ఈ సందేహం వచ్చింది.

ఓ వెబ్ సైట్ పెట్టి.. సర్వే చేసి..
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి నచ్చే జోక్ ఏమిటన్నది తేల్చేందుకు ఓ పరిశోధన చేపట్టాడు. దీని కోసం ఓ వెబ్ సైట్ పెట్టాడు. ‘మీకు ఇష్టమైన జోకులను పంపండి.. అందరూ పెట్టిన వాటిలో నచ్చిన వాటికి ఓటేయండి’ అని కోరాడు. ఇది మెల్లమెల్లగా చాలా మందికి చేరింది. చాలా మంది జోకులు పోస్టు చేయడం, మరెంతో మంది వాటిని లైక్ చేయడం మొదలైంది. మొత్తంగా 40 వేల జోకులు రాగా.. వాటికి 20 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. మొత్తంగా ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన గోస్సాల్‌ అనే ఆయన పెట్టిన జోక్‌ కు ఎక్కువ మంది ఓటేశారు. ఆ జోక్ ఏమిటో తెలుసా?

వేటగాళ్లు.. అడవి.. తుపాకీ
ఇద్దరు వేటగాళ్లు ఒకసారి అడవికి వెళ్లారు. అందులో ఒకరు ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు. ఊపిరి కూడా ఆడుతున్నట్టు కనిపించలేదు. దీంతో అతను చనిపోయి ఉంటాడని రెండోవాడికి అనిపించింది. అయినా హెల్త్ ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్‌ చేశాడు.
‘నా స్నేహితుడు చనిపోయాడు. నేనిప్పుడు ఏం చేయాలి’ అని ఆదుర్దాగా అడిగాడు.
అటు వైపు ఆపరేటర్‌.. ‘నేను మీకు సాయం చేస్తాను. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. మీ స్నేహితుడు నిజంగానే చనిపోయాడా లేదా అన్నది ముందు చెక్ చేసుకోండి’ అని చెప్పాడు. 
ఒక్క నిమిషం నిశ్శబ్దం.. ఇంతలో తుపాకీ పేలిన శబ్దం..
నా స్నేహితుడు చనిపోయాడు.. కన్ఫర్మ్‌.. ఇప్పుడు నేనేం చేయాలి’ అని ఆ వేటగాడు మళ్లీ అడిగాడు. ఆపరేటర్ గతుక్కుమన్నాడు.

శాస్త్రీయంగానూ దీనికి మార్కులు..
మంచి జోక్‌ అంటే ఆశ్చర్యం కలిగిస్తాయని.. టెన్షన్ ను, యాంగ్జయిటీని తగ్గిస్తాయని.. సైకాలజిస్టు రిచర్డ్ వైస్ మ్యాన్ తెలిపారు. శాస్త్రీయంగా చూసినా ఈ జోక్ లో ఇలాంటి ప్రమాణాలు ఉన్నాయని చెప్పారు. 103 పదాలు ఉండే జోక్‌లు ప్రజలకు ఎక్కువగా నచ్చుతాయని.. ఈ జోక్‌లో 102 పదాలు (ఇంగ్లిష్‌లో) ఉన్నాయని వివరించారు. ఇక ఏటా అక్టోబర్‌ 7న, అదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో జోకులు ఎక్కువగా నవ్విస్తాయని తమ సర్వేలో తేలినట్టు పరిశోధకులు వివరిస్తున్నారు.


More Telugu News