కాళికామాత వివాదాస్పద పోస్టర్ పై ఢిల్లీ, యూపీలలో కేసుల నమోదు

  • మత మనోభావాలను గాయపరిచినందుకు ఎఫ్ఐఆర్ నమోదు
  • కెనడాలో శరణార్థిగా నివసిస్తున్న దర్శక, నిర్మాత మణిమేకలై
  • భారత ఎంబసీ అభ్యంతరం
కాళికామాత పట్ల అగౌరవాన్ని ప్రదర్శించిన ‘కాళి’ చిత్ర నిర్మాత, దర్శకురాలు లీనా మణిమేకలైకు వ్యతిరేకంగా ఢిల్లీ, యూపీ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాళికామాత సిగరెట్ తాగుతున్న పోస్టర్ ను ఆమె విడుదల చేయడంపై హిందువుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నేరపూరిత కుట్ర, దేవతల పట్ల అపచారం, మత మనోభావాలను గాయపరచడం, శాంతికి ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించడం తదితర ఆరోపణలపై కేసులు దాఖలయ్యాయి. 

ఢిల్లీకి చెందిన న్యాయవాది వినీత్ జిందాల్ పోలీసులకు ఈ పోస్టర్ పై ఫిర్యాదు చేశారు. అలాగే, గో మహాసభ నేత అజయ్ గౌతమ్ పోలీసులకు, కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేశారు. 

లీనా మణిమేకలై కాళి సినిమా పోస్టర్ ను సామాజిక మాధ్యమ వేదికలపై షేర్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కెనడాలో శరణార్ధిగా నివసిస్తోంది. శరణార్థి రక్షణ చట్టం కింద ఆమెకు రక్షణ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ, భారత ఎంబసీ ఇప్పటికే తన అభ్యంతరాన్ని కెనాడాకు తెలియజేసింది. కాళికామాతను అగౌరవంగా చూపిస్తున్న పోస్టర్లను తొలగించాలని కోరింది. దీంతో  మణిమేకలై ఇకమీదట ఇలా వ్యహరించకుండా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.


More Telugu News