హిందూ దేవతలున్న పేపర్లలో చికెన్ ప్యాకింగ్.. యూపీలో ముస్లిం వ్యాపారి అరెస్ట్

  • సంభాల్ ప్రాంతంలో చికెన్ వ్యాపారి నిర్వాకం
  • విచారణకు వచ్చిన పోలీసులపై కత్తితో దాడికి యత్నించిన వ్యాపారి
  • అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసిన పోలీసులు
పరమత దేవుళ్ల పట్ల ద్వేష భావం, చులకన భావం పెరిగిపోతున్న తీరు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తోంది. ఇందుకు సంబంధించి పలు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మహమ్మద్ ప్రవక్త గురించి బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడం, రాజస్థాన్, మహారాష్ట్రలో హిందువుల తలలు తెగనరకడం, కాళికా మాత నోట్లో సిగరెట్ తో పోస్టర్ ఇలా ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా యూపీలోని సంభాల్ లో ఓ ముస్లిం వ్యాపారి హిందూ దేవతల చిత్రాలున్న పేపర్లలో చికెన్ ప్యాక్ చేసి విక్రయిస్తున్న తీరు వెలుగులోకి వచ్చింది. 

తాలీబ్ హుస్సేన్ అనే వ్యాపారి హిందూ దేవత, దేవుడి చిత్రాలున్న పేపర్లలో చికెన్ ప్యాక్ చేసి విక్రయిస్తున్నాడని, మత మనోభావాలను గాయపరుస్తున్నాడంటూ కొంత మంది ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు తాలీబ్ హుస్సేన్ షాపులో తనిఖీకి వెళ్లగా.. కత్తితో పోలీసులపైకి అతడు దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు మతాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడంటూ సెక్షన్ 153-ఏ, సెక్షన్ 295ఏ, సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశారు.


More Telugu News