తమిళనాడుకు స్వయంప్రతిపత్తి ఇవ్వండి... లేకపోతే ప్రత్యేక తమిళనాడు కోసం డిమాండ్ చేయాల్సి ఉంటుంది: డీఎంకే ఎంపీ రాజా

  • నమక్కల్ లో డీఎంకే స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం
  • హాజరైన సీఎం స్టాలిన్
  • రాజా వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టిన స్టాలిన్
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు గుర్రుగా ఉన్నాయి. ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి సహకారం ఉండడంలేదని ఆయా రాష్ట్రాల వాదన. అలాంటి రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఈ నేపథ్యంలో, తమిళనాడు అధికార పక్షం డీఎంకే ఎంపీ ఏ.రాజా తన వ్యాఖ్యలతో కలకలం రేపారు. తమిళనాడు రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని, లేకపోతే ప్రత్యేక తమిళనాడు కోసం డిమాండ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

రాజా ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వేదికపై ఉన్నారు. నమక్కల్ లో నిర్వహించిన డీఎంకే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. రాజా ఈ సంచలన వ్యాఖ్యలు చేయగానే, స్టాలిన్ అభినందనపూర్వకంగా చప్పట్లు కొట్టడం కనిపించింది. 

తమిళనాడుకు స్వయంప్రతిపత్తి కల్పించేంతవరకు తమ పోరాటం ఆపబోమని రాజా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తమ సిద్ధాంతకర్త పెరియార్ భారత్ నుంచి తమిళనాడును విడదీయాలని గతంలో పేర్కొన్నారని గుర్తుచేశారు. అయితే, భారతదేశ ఐక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని ఆ డిమాండ్ ను తాము పక్కనబెడుతున్నామని రాజా వెల్లడించారు. 

కేంద్రం కూడా తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని, తమిళనాడుకు స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. 'ప్రత్యేక తమిళనాడు' డిమాండ్ ను మళ్లీ తెరపైకి తెచ్చే పరిస్థితులను కల్పించవద్దని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి చేస్తున్నామని స్పష్టం చేశారు.


More Telugu News