ఏక్ నాథ్ షిండేకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఆదిత్య థాకరే... పార్టీ క్రమశిక్షణ చర్యలకు గురయ్యే అవకాశం!

  • మహా అసెంబ్లీలో బల నిరూపణ పూర్తి
  • షిండేకు 164 ఓట్లు
  • అవసరమైన దానికంటే 20 ఓట్లు అదనం
  • షిండేకు వ్యతిరేకంగా 99 ఓట్లు
  • వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో ఆదిత్య థాకరే
మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ జరిగిన బలపరీక్షలో సీఎం ఏక్ నాథ్ షిండే నెగ్గడం తెలిసిందే. అసెంబ్లీలో మొత్తం స్థానాలు 288 కాగా, అవసరమైన బలం 144. అంతకంటే 20 ఓట్లు ఎక్కువగా షిండేకు అనుకూలంగా ఇవాళ 164 ఓట్లు లభించాయి. బలపరీక్షలో షిండేకు వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చాయి. షిండేకు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో ఆదిత్య థాకరే కూడా ఉన్నారు. అయితే, ఆదిత్య థాకరే శివసేన పార్టీ క్రమశిక్షణ చర్యలకు గురయ్యే అవకాశం ఉంది. 

ఎందుకంటే... గతంలో శివసేన పార్టీకి 55 ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 39 మంది షిండే పంచన చేరారు. మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే వద్ద 16 మందే మిగిలారు. అసెంబ్లీలో శివసేన నాయకుడిగా సీఎం ఏక్ నాథ్ షిండేను గుర్తిస్తున్నట్టు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో, తమదే శివసేన అని షిండే వర్గం చెప్పుకుంటోంది. 

శివసేన ఎమ్మెల్యేలందరూ సీఎం ఏక్ నాథ్ షిండేకు అనుకూలంగానే ఓటు వేయాలని స్పష్టం చేశారు. అసెంబ్లీలో విప్ కూడా జారీ చేశారు. కానీ, ఎమ్మెల్యే ఆదిత్య థాకరే సీఎంకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆయనపై అనర్హత వేటు వేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

అయితే, ఉద్ధవ్ థాకరే వర్గం సుప్రీంకోర్టు వెలువరించబోయే తీర్పుపై ఆశావహ దృక్పథంతో ఉంది. షిండే వర్గం ఎంపిక చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ను స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఎలా గుర్తిస్తారంటూ థాకరే వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. షిండేతో పాటు మరో 15 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని సుప్రీంకోర్టు ఇంకా పరిశీలించి నిర్ణయం తీసుకోలేదని, అలాంటప్పుడు సభలో జారీ అయ్యే విప్ లను స్పీకర్ గుర్తించజాలరని థాకరే వర్గం తమ పిటిషన్ లో పేర్కొంది.


More Telugu News