సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను బలిగొన్న ఆన్ లైన్ మోసం

  • హైదరాబాదులో ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్న శ్వేత
  • గత మూడు నెలలుగా వర్క్ ఫ్రమ్ హోమ్
  • ఆన్ లైన్ లో ఓ వ్యక్తి పరిచయం
  • అధిక ధనార్జనపై అతడి మాటలకు బుట్టలో పడిన వైనం
హైదరాబాదులో ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన జాస్తి శ్వేత చౌదరి (22) ఓ ఆన్ లైన్ మోసగాడి బారినపడి ఆత్మహత్య చేసుకుంది. రూ.1.2 లక్షలు చెల్లిస్తే రూ.7 లక్షలు వస్తాయని నమ్మబలికిన ఆ మోసగాడు, ఆమె నుంచి డబ్బు కాజేసి ఆపై పత్తా లేకుండా పోయాడు. దాంతో తాను మోసపోయానని భావించిన శ్వేత బలవన్మరణం చెందింది. 

వివరాల్లోకెళితే... జాస్తి శ్వేతా చౌదరి స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు. గత 3 నెలల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఇంటివద్ద నుంచే పనిచేస్తోంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన శ్వేతకు ఓ వ్యక్తి ఆన్ లైన్ లో పరిచయం అయ్యాడు. అధిక ధనార్జన గురించి అతడు చెప్పిన మాటలకు శ్వేత బుట్టలో పడింది. 

మొదట రూ.1.2 లక్షలు చెల్లించాలని అతడు సూచించాడు. తన వద్ద అంత మొత్తం లేవని శ్వేత చెప్పడంతో, అతడే రూ.50 వేలు పంపించాడు. మిగిలిన మొత్తం శ్వేతనే సర్దుబాటు చేసుకుని అతడు చెప్పిన విధంగా ఓ ఖాతాకు బదిలీ చేసింది. అయితే, గత రెండ్రోజుల నుంచి ఆ వ్యక్తి ఫోన్ ఎత్తకపోవడంతో శ్వేత ఆందోళన చెందింది. ఆ వ్యక్తి తనను మోసగించాడని నిర్ధారణకు వచ్చిన శ్వేత శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వచ్చి చిల్లకల్లు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. 

తిరిగి కుటుంబ సభ్యులు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా శ్వేత ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి చిల్లకల్లు చెరువు వద్ద గాలించినా ఫలితం దొరకలేదు. మరుసటి రోజు ఉదయం మళ్లీ గాలింపు చేపట్టగా, ఆమె మృతదేహం లభ్యమైంది. శ్వేత మృతదేహాన్ని చూసి ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.


More Telugu News