అగ్నిపథ్​ పథకంపై విచారణకు సుప్రీంకోర్టు ఓకే.. వచ్చే వారం నుంచి వాదనలు

  • ఇప్పటికే శిక్షణ పొందిన అభ్యర్థుల తరఫున పిటిషన్లు
  • తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన
  • త్వరగా విచారణ జరపాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి
త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా తెచ్చిన ‘అగ్ని పథ్’ పథకానికి సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తమకు అన్యాయం జరుగుతుందంటూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు పరిశీలించింది. వచ్చే సోమవారం నుంచి దీనికి సంబంధించిన వాదనలు వినేందుకు అంగీకరించింది.

వైమానిక దళ అభ్యర్థుల తరఫున..
వైమానిక దళంలో ఇప్పటికే రిక్రూట్ మెంట్ కు ఎంపికై శిక్షణ పొందిన అభ్యర్థులు సుప్రీంకోర్టులో ‘అగ్ని పథ్’కు వ్యతిరేకంగా పిటిషన్లు వేశారు. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకుని.. నియామకం కోసం ఎదురుచూస్తున్నామని వారు కోర్టుకు వివరించారు. అదే నియామకం జరిగితే తాము 20 ఏళ్లకుపైగా సర్వీసులో ఉండే వారమని.. కానీ అగ్నిపథ్ కింద నియామకాలు చేపడితే.. ఈ సర్వీసు కేవలం నాలుగేళ్లకు తగ్గిపోతుందని తెలిపారు. ఇది అత్యంత ప్రధానమైన అంశమని.. ఎందరో అభ్యర్థుల జీవితాలు దీనితో ముడిపడి ఉన్నాయని వివరించారు. అందువల్ల వెంటనే విచారణకు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఈ నెల 11వ తేదీ నుంచి విచారణ చేపడతామని ప్రకటించింది.

దేశవ్యాప్తంగా ఆందోళనలు..
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన వారు అగ్నివీరులుగా నాలుగేళ్లపాటు సేవలు అందిస్తారు. తర్వాత అందులో 25 శాతం మందే శాశ్వత కేడర్‌కు ఎంపికవుతారని కేంద్రం పేర్కొంది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితిని ఈ ఒక్క ఏడాదికి 23 ఏళ్లకు పెంచారు.


More Telugu News