అల్లూరి సీతారామరాజు ఒక అగ్నికణం: జగన్

  • భీమవరం సభలో మోదీని సత్కరించిన జగన్
  • అల్లూరి జయంతి సందర్భంగా అందరం ఏకమయ్యామన్న సీఎం
  • అల్లూరి పుట్టిన గడ్డపై పుట్టడం మన అదృష్టమని వ్యాఖ్య
అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మనమంతా ఏకమయ్యామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. భీమవరంలో జరుగుతున్న సభలో ప్రధాని మోదీని జగన్ సత్కరించారు. ప్రధానికి విల్లంబు, సీతారాముల పటాన్ని బహూకరించారు. సభావేదికపై మోదీ, జగన్ లతో పాటు గవర్నర్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి రోజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సినీ నటుడు చిరంజీవి తదితరులు ఆసీనులయ్యారు.  

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఒక మనిషిని ఇంకొక మనిషి, ఒక జాతిని మరొక జాతి, ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని చెప్పారు. అల్లూరి సీతారామరాజు ఒక అగ్నికణమని కొనియాడారు. తెలుగు జాతికే కాకుండా, యావత్ దేశానికి అల్లూరి ఒక స్ఫూర్తిప్రదాత అని అన్నారు. ఆయన ఘనతను గుర్తుంచుకోవడానికే ఆయన పేరుపై జిల్లాను ఏర్పాటు చేశామని చెప్పారు. అల్లూరి చేసిన త్యాగం ప్రతి మనిషి గుండెలో చిరకాలం నిలిచిపోతుందని అన్నారు. ఆయన తెలుగుగడ్డపై పుట్టడం మనందరి అదృష్టమని చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారని తెలిపారు.


More Telugu News