ఆ ప్రచారం ఫేక్.. తాజ్‌మహల్‌లో అలాంటివేవీ లేవు: పురావస్తు శాఖ స్పష్టీకరణ

  • తాజ్‌మహల్ నేలమాళిగలో దేవతా విగ్రహాలు ఉన్నాయంటూ ప్రచారం
  • మూసివున్న 22 గదులు తెరవాలంటూ హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత
  • టీఎంసీ నేత ఆర్టీఐ ప్రశ్నలకు బదులిచ్చిన ఏఎస్ఐ
  • నేలమాళిగలో మూసివున్న గదుల్లేవని స్పష్టీకరణ
తాజ్‌మహల్‌లో దేవతా విగ్రహాలు ఉన్నాయన్న ప్రచారాన్ని భారత పురావస్తు శాఖ (ASI) కొట్టిపారేసింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని, తాజ్‌మహల్‌లో ఎక్కడా దేవతా విగ్రహాలు లేవని స్పష్టం చేసింది. తాజ్‌మహల్ నేలమాళిగలో ఉన్న గదుల్లో దేవతా విగ్రహాలు ఉన్నాయన్న ప్రచారం ఇటీవల విస్తృతంగా జరిగింది. దీంతో మూసివున్న ఆ 22 గదులను తెరవాలంటూ అయోధ్య బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ డాక్టర్ రజనీష్ కుమార్ ఈ ఏడాది మే 7న అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ గదులను తెరిచేలా పురావస్తు శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

అయితే, ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత టీఎంసీ నేత సాకేత్ గోఖలే సమాచార హక్కు చట్టం ద్వారా గత నెల 21న కొన్ని ప్రశ్నలు సంధిస్తూ పురావస్తు శాఖ నుంచి జవాబులు కోరారు. తాజ్‌మహల్ నిర్మించిన భూమి ఏదైనా ఆలయానికి చెందినదా? తాజ్‌మహల్ నేలమాళిగలో మూసివున్న గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయా? అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. పురావస్తు శాఖ ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. తాజ్‌మహల్ నేలమాళిగలో అసలు మూసివున్న గదులే లేవని, తాజ్‌మహల్ నిర్మించిన ప్రదేశం ఏ ఆలయానికి చెందినది కాదని తేల్చి చెప్పింది. 

ఈ మేరకు కేంద్ర ప్రజా సంబంధాల అధికారి మహేశ్ చంద్ర మీనా ఆన్‌లైన్‌లో సమాధానమిచ్చారు. గోఖలే అడిగిన తొలి ప్రశ్నకు ‘నో’ అని సమాధానమిచ్చిన ఆయన రెండో ప్రశ్నకు.. సెల్లార్‌లో ఎలాంటి దేవతా విగ్రహాలు లేవని పేర్కొన్నారు. ఏఎస్ఐ సమాధానంపై ఆగ్రా టూరిస్ట్ వెల్ఫేర్ చాంబర్ అధ్యక్షుడు ప్రహ్లాద్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఏఎస్ఐ సమాధానంతో ఇకపై తాజ్‌మహల్‌కు సంబంధించి మతపరమైన ఎలాంటి కొత్త వివాదాలు రేకెత్తవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి వివాదాల వల్ల పర్యాటకం నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News