ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 284 ఆలౌట్... టీమిండియాకు 132 పరుగుల ఆధిక్యం

  • 4 వికెట్లు తీసిన సిరాజ్
  • బెయిర్ స్టో సెంచరీ
  • రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా
  • ఆరంభంలోనే గిల్ అవుట్
బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 284 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ కు 4 వికెట్లు దక్కగా, బుమ్రా 3, షమీ 2, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు. 

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో జానీ బెయిర్ స్టో సెంచరీ హైలైట్ గా నిలిచింది. బెయిర్ స్టో 140 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 106 పరుగులు చేశాడు. అయితే షమీ ఆఫ్ స్టంప్ ఆవల విసిరిన బంతిని షాట్ ఆడబోయి స్లిప్స్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా, బెయిర్ స్టో క్యాచ్ పట్టిన కోహ్లీ ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అతడికి వీడ్కోలు పలికాడు. బెయిర్ స్టో అవుటయ్యాక కాసేపటికే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కు తెరపడింది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ శామ్ బిల్లింగ్స్ 36 పరుగులు చేయగా, మాథ్యూ పాట్స్ 19 పరుగులు సాధించాడు. 

అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాను ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. 4 పరుగులు చేసిన ఓపెనర్ శుభ్ మాన్ గిల్ ను ఓ స్వింగింగ్ డెలివరీతో అవుట్ చేశాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 9 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 27 పరుగులు కాగా, క్రీజులో ఛటేశ్వర్ పుజారా (15 బ్యాటింగ్), హనుమ విహారి (2 బ్యాటింగ్) ఉన్నారు. టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 159 పరుగులకు చేరింది.


More Telugu News