తెలంగాణలో కమల వికాసమే..: యోగి ఆదిత్యనాథ్‌

  • ఆ రోజులు త్వరలోనే వస్తాయి
  • టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అరాచకాలను ఎదిరించాలి
  • బీజేపీని అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలి
  • యూపీలో డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో అభివృద్ధి జరుగుతోందని వెల్లడి
ప్రధాని మోదీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కమలం వికసిస్తుందని, త్వరలోనే ఆ రోజులు వస్తాయని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ సర్కారు ఏ ఒక్క కేంద్ర పథకాన్ని కూడా సరిగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రతి కేంద్ర పథకానికి రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేస్తున్నట్టుగా ముద్ర వేసుకుంటోందని ఆరోపించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో వచ్చిన మార్పులు అందరి కళ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రధాని మోదీ అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించడంతోపాటు కాశీలో విశ్వనాథుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారని గుర్తు చేశారు.

టీఆర్‌ఎస్‌ కుట్రలను అడ్డుకోవాలి
రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్‌ కుట్రలకు పాల్పడుతోందని.. గతంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కు బుద్ధి చెప్పినట్టుగా, మళ్లీ తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీ డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఉండటంతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. పేదల కోసం 45 లక్షల ఇళ్లు కట్టించామని.. ఆ రాష్ట్రంలో 6 కోట్ల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఆరోగ్య బీమా అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా సంక్షోభంలో 15 కోట్ల మందికి నెలకు రెండు సార్లు ఉచితంగా రేషన్‌ బియ్యం అందించామన్నారు.



More Telugu News