పార్టీలో అన్ని పదవులను రద్దు చేసిన అఖిలేశ్ యాదవ్... ఆ ఒక్కటి తప్ప!

  • గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి దారుణ ఫలితాలు
  • ఇటీవలి లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ అదే తీరు
  • పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించిన అఖిలేశ్
  • 2024 లోక్ సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యం
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఇటీవల రాంపూర్, అజంగఢ్ లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ సమాజ్ వాదీ పార్టీకి ఘోర పరాజయాలే ఎదురయ్యాయి. దాంతో, సమాజ్ వాదీ పార్టీ అధినాయకత్వం ఈ ఫలితాలపై తీవ్ర నిరాశకు గురైంది. కాగా, పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమాజ్ వాదీ పార్టీలో అన్ని పదవులు రద్దు చేశారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి, యూత్, మహిళా విభాగం అన్నింటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. 

అయితే, జాతీయ అధ్యక్ష పదవి కాకుండా మరొక్క పదవిని మాత్రం ఉంచారు. సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్ ను మాత్రం కొనసాగిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ఇప్పటినుంచి సమాయత్తం అయ్యేందుకు వీలుగా, పార్టీని ప్రక్షాళన చేస్తున్నట్టు ఎస్పీ సీనియర్ నేత వెల్లడించారు.


More Telugu News