బ్రిట‌న్ పార్ల‌మెంట్‌లో ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి... ఇండియన్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డు అందుకున్న అమృత‌

  • ఇండో యూకే రిలేష‌న్స్‌పై బ్రిట‌న్ పార్ల‌మెంట్‌లో చ‌ర్చ‌
  • కీల‌కోప‌న్యాసం చేసిన అమృత ఫ‌డ్న‌వీస్‌
  • మోదీ చ‌ర్య‌ల వ‌ల్ల ఇండో యూకే సంబంధాలు మెరుగ‌య్యాయని వెల్ల‌డి
మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన బీజేపీ కీల‌క నేత దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి అమృత ఫ‌డ్న‌వీస్ శ‌నివారం బ్రిట‌న్ పార్లమెంట్ లో త‌ళుక్కుమ‌న్నారు. ఇండో యూకే రిలేష‌న్స్ అనే అంశంపై చేప‌ట్టిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో ఆమె పాలుపంచుకున్నారు. ఈ అంశంపై కీల‌కోప‌న్యాసం చేసిన అమృత అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు ఇండియ‌న్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డును కార్య‌క్ర‌మ నిర్వాహ‌కులు అంద‌జేశారు. 

ఈ విష‌యాన్ని అమృత త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా వెల్ల‌డించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల్ల భార‌త్, బ్రిట‌న్‌ల మ‌ధ్య సంబంధాలు మ‌రింత మెరుగ‌య్యాయ‌ని ఆమె వ్యాఖ్యానించారు. బ్రిటన్ పార్ల‌మెంటులో జ‌రిగిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పాలుపంచుకోవ‌డం గ‌ర్వంగా ఉంద‌ని కూడా ఆమె తెలిపారు. 

రాజ‌కీయాల్లో దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ స‌త్తా చాటుతుంటే... ఇత‌ర‌త్రా సామాజిక కార్య‌క్ర‌మాల్లో అమృత చురుగ్గా పాలుపంచుకుంటున్న విషయం తెలిసిందే. నేప‌థ్య గాయ‌నిగా, సామాజిక కార్య‌క‌ర్త‌గా, బ్యాంక‌ర్‌గా స‌త్తా చాటుతున్న అమృత త‌న అభిప్రాయాల‌ను ధైర్యంగా వెల్ల‌డిస్తూ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ సీఎంగా ఉన్న స‌మ‌యంలోనూ ఆమె ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకున్న సంగ‌తి తెలిసిందే.


More Telugu News