ఎమ్మెల్యేగా ఉంటే... వ్యాపారం చేయ‌కూడ‌దా?: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి

  • రియ‌ల్ ఎస్టేట్‌తో పాటు కాంట్రాక్టులు కూడా చేస్తున్నాన‌న్న కోటంరెడ్డి
  • వ్యాపార‌స్తుల‌ను వేధిస్తే త‌ప్పు గానీ వ్యాపారం చేస్తే త‌ప్పేముందని ప్ర‌శ్న‌
  • ఇత‌ర రాష్ట్రాల్లో కూడా వ్యాపారం చేస్తున్నాన‌ని వెల్ల‌డి
అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ టీడీపీ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి స్పందించారు. తాను రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు కాంట్రాక్టులు, స‌బ్ కాంట్రాక్టులు కూడా చేస్తున్నాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ మేర‌కు శ‌నివారం నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కోటంరెడ్డి త‌న వ్యాపారాల‌పై కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. రాజ‌కీయ దందాలు చేస్తే తప్పు గానీ, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే త‌ప్పేముంద‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. వ్యాపార‌స్తుల‌ను వేధిస్తే త‌ప్పు గానీ... వ్యాపారం చేస్తే త‌ప్పేముందని కూడా ఆయ‌న టీడీపీ నేత‌ల‌ను నిల‌దీశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా ఉంటే వ్యాపారం చేయ‌కూడ‌దా? అని కోటంరెడ్డి ప్ర‌శ్నించారు. నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు పొరుగునే ఉన్న సూళ్లూరుపేట, తిరుప‌తి, త‌మిళ‌నాడులోని తిరువ‌ళ్లూరు, బెంగ‌ళూరు, హైద‌రాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లోనూ తాను రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు కాంట్రాక్టులు కూడా చేస్తున్నాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు మైసూర్‌, త‌మిళనాడుల్లోనూ తాను కాంట్రాక్టులు చేస్తున్నాన‌న్న కోటంరెడ్డి... స‌బ్ కాంట్రాక్టులు కూడా చేస్తున్నాన‌ని తెలిపారు. తాను వ్యాపారం చేయ‌లేద‌ని ఏనాడూ చెప్ప‌లేద‌ని కూడా ఆయ‌న తెలిపారు.


More Telugu News