మహిళల వస్త్రధారణ మీద కామెంట్ చేయడం చాలామందికి ఫ్యాషన్ అయింది: నాగబాబు

  • వీరమహిళలకు శిక్షణ తరగతులు
  • మంగళగిరి జనసేన కార్యాలయంలో కార్యక్రమం
  • ప్రారంభించిన నాగబాబు
  • జనసేన పార్టీలో ప్రతి మహిళ వీరమహిళేనని ఉద్ఘాటన
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక వీరమహిళల రాజకీయ అవగాహన, పునశ్చరణ తరగతులను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, మహిళలకు రాజకీయ వ్యవహారాల్లో గౌరవప్రదమైన స్థానం అందించాలన్నది పవన్ కల్యాణ్ ఆకాంక్ష అని, అందుకే ఈ రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారని వెల్లడించారు. జనసేన వీర మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

జనసేన పార్టీలో ప్రతి మహిళను వీర మహిళ పేరుతో గౌరవించుకునే సంస్కృతి ఉందని నాగబాబు పేర్కొన్నారు. చాలా రాజకీయ పార్టీల్లో మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంటారు కానీ, ఆచరణలో చూపేవారు తక్కువ అని విమర్శించారు. సంప్రదాయ రాజకీయ పార్టీల్లో మహిళలను ప్రచారం కోసం ఉపయోగించుకునేవారే ఎక్కువ అని ఆరోపించారు. చట్ట సభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. 

మనకు ఎన్ని కష్టాలు ఉన్నా అమ్మ ముఖం చూడగానే అన్నీ మరిచిపోతామని, మనకు తోబుట్టువుల వంటి మహిళలు ఓదార్పునిస్తారని నాగబాబు పేర్కొన్నారు. అమరావతి ఉద్యమంలో కీలకభూమిక పోషించిన గౌరవాన్ని మహిళలు సొంతం చేసుకున్నారని వివరించారు. ఇక, మహిళల వస్త్రధారణ మీద కామెంట్ చేయడం చాలామందికి ఫ్యాషన్ అయిందని, చూసే కళ్లను బట్టి ఆలోచన ఉంటుందని అన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని నాగబాబు స్పష్టం చేశారు.


More Telugu News