ఒక వ్యక్తి చెపుతుంటే 135 కోట్ల మంది ప్రజలు వినాలా?: యశ్వంత్ సిన్హా

  • దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి
  • కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చాలా  కాలంగా పోరాడుతున్నాం
  • దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో కేసీఆర్ సవివరంగా చెప్పారు

దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. మన దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సవివరంగా చెప్పారని తెలిపారు. చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటమో, ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటమో కాదని చెప్పారు. ఇది విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటమని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతును ప్రకటించిన కేసీఆర్, కేటీఆర్ కు ధన్యవాదాలు చెపుతున్నానన్నారు. 

ఒక వ్యక్తి (మోదీ) చెపుతుంటే 135 కోట్ల మంది ప్రజలు వినాలా? అని యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి ఏమాత్రం మేలు చేయవని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కూడా కేంద్రంపై పోరాటం కొనసాగుతుందని చెప్పారు. దేశానికి కేటీఆర్ వంటి యువ నేతలు అవసరమని అన్నారు. ఢిల్లీకి వచ్చి కేటీఆర్ తనకు మద్దతు ప్రకటించారని తెలిపారు. కేసీఆర్ తో మరోసారి సమావేశమవుతానని చెప్పారు.


More Telugu News