83 ఏళ్ల భర్త.. 78 ఏళ్ల భార్య.. భర్తకు భరణం ఇవ్వాల్సిందేనన్న కోర్టు

  • భార్య వేధింపులపై కోర్టుకు ఎక్కిన భర్త
  • విచారణ జరిపి విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు
  • భర్తకు నెల నెలా రూ.25 వేలు భరణంగా చెల్లించాలని ఆదేశం
ప్రపంచ ధనవంతులు భార్యకు విడాకులు ఇస్తూ వందల కోట్ల సంపదను భరణంగా చెల్లించారని ఈ మధ్య తరచూ వార్తల్లో చూస్తున్నాం. దేశంలో, రాష్ట్రంలోనూ అప్పుడప్పుడూ ఇలాంటివి జరుగుతుండటం మామూలే. కానీ మహారాష్ట్రలోని పుణె ఫ్యామిలీ కోర్టు భిన్నమైన తీర్పు ఇచ్చింది. ఓ వృద్ధ జంటకు విడాకులు మంజూరు చేస్తూనే.. సదరు భర్తకు భార్య నెల నెలా రూ.25 వేలు భరణంగా చెల్లించాలని ఆదేశించింది. 

తప్పు ఎవరి వైపు ఉన్నా తప్పే..
పుణెకు చెందిన ఓ 83 ఏళ్ల వృద్ధుడు తన 78 ఏళ్ల భార్య తనను విపరీతంగా వేధిస్తోందని.. విడాకులతో పాటు భరణం ఇప్పించాలని కోరుతూ 2019లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తమ వివాహమై 55 ఏళ్లు అయిందని, ఇన్నేళ్లుగా కూడా తాను ఇబ్బంది పడుతూనే ఉన్నానని విన్నవించారు. దీనిపై కోర్టు విచారణ జరిపి తాజాగా తీర్పు ఇచ్చింది. ఆ ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది. తప్పు ఎవరి వైపు ఉన్నా తప్పేనని.. సంపాదన, విడాకుల విషయంలో స్త్రీపురుష భేదం చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భార్య ప్రతినెలా రూ.25 వేల చొప్పున భర్తకు భరణంగా ఇవ్వాలని ఆదేశించింది.

‘‘హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం.. భార్యా భర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు విడాకులు మంజూరు చేయవచ్చు. అందులో భార్యకు ఆదాయం ఉండి భర్తకు ఎలాంటి ఆదాయ మార్గం లేనప్పుడు సదరు భార్య నుంచి భర్త భరణాన్ని కోరవచ్చు. భార్యలే కాదు బాధిత భర్తలు కూడా సమాన న్యాయాన్ని పొందవచ్చని ఈ కేసులో కోర్టు తీర్పు స్పష్టం చేస్తోంది..” అని పిటిషనర్ తరఫు న్యాయవాది వైశాలి చండే పేర్కొన్నారు. 



More Telugu News