అటువంటి సందర్భాల్లో బౌలర్లను కలతకు గురి చేయాల్సిందే: పంత్

  • బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెడుతుంటే మరో మార్గం లేదన్న పంత్
  • క్రీజును చక్కగా ఉపయోగించుకున్నట్టు ప్రకటన
  • 100 శాతం ఫలితాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించినట్టు వెల్లడి
ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ వీరోచితంగా పోరాడాడు. నిన్నటి మ్యాచ్ లో భారత్ త్వరగా ఐదు వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో రిషబ్ పంత్ క్రీజులో ఫెవికాల్ వేసి నించున్న మాదిరి బ్యాట్ తో విరుచుకుపడ్డాడు. పొట్టి క్రికెట్ టీ20లో మాదిరిగా ఇన్నింగ్స్ ఆడి 111 బంతులకు 146 పరుగులు చేసి అవుటయ్యాడు. పంత్ కు తోడు రవీంద్ర జడేజా నిదానంగా ఆడుతూ అతడు సైతం క్రీజులో పాతుకుపోయాడు.

తన ఆటతీరుపై మ్యాచ్ అనంతరం మీడియా నుంచి ఎదురైన ప్రశ్నలకు పంత్ స్పందించాడు. ‘‘ఇంగ్లండ్ తరహా పరిస్థితుల్లో బౌలర్ ఒకే మాదిరి, ఒకే చోట బాల్ వేస్తూ బ్యాట్స్ మెన్ ను ఇబ్బందికి గురిచేస్తుంటే, వారిని కలవరానికి గురిచేయడం అన్నది చాలా కీలకం అవుతుంది’’అని  పంత్ పేర్కొన్నాడు. 

‘‘నేను అక్కడ ప్రయత్నించినట్టుగా ప్రతి సారి ఆడకూడదు. కొన్ని సందర్భాల్లో క్రీజు నుంచి బయటకు వచ్చాను. కొన్ని సందర్భాల్లో వెనక్కు వెళ్లాను. క్రీజును చక్కగా ఉపయోగించుకున్నాను. నా వైపు నుంచి కొంచెం ప్రయత్నాన్ని జోడించాను’’అని వివరించాడు. అసాధారణ షాట్లకు ప్రయత్నించడం ఎందుకున్న ప్రశ్నకు.. ఒక ఆటగాడిగా 100 శాతం ఫలితాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించానని.. ఇందులో భాగంగా కొన్ని భిన్నమైన షాట్లను ఆడినట్టు చెప్పాడు.


More Telugu News