అచ్చెన్నాయుడు పేరుతో వైరల్ అవుతున్న ఫేక్ ప్రకటన.. క్లారిటీ ఇచ్చిన టీడీపీ!

  • టీడీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసేస్తామని అచ్చెన్న పేరిట ప్రకటన
  • అది ఫేక్ ప్రకటన అన్న అశోక్ బాబు
  • వైసీపీ నేతల పన్నాగమని మండిపాటు
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నిజమైన వార్తో, ఏది ఫేక్ వార్తో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎవరికి ఇష్టమైన విధంగా వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తాజాగా, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరిట ఒక ఫేక్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేస్తామంటూ అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్ న్యూస్ ప్రచారమవుతోంది. ఈ ప్రకటన పట్ల టీడీపీ అధికారికంగా స్పందించింది.

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ, గందరగోళం సృష్టించడానికే ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రకటన నకిలీదని చెప్పారు. టీడీపీ కానీ, అచ్చెన్నాయుడు కానీ ఇలాంటి ప్రకటన చేయలేదని అన్నారు. వైసీపీ నేతల పన్నాగంలో ఈ ప్రకటన ఒక భాగమని విమర్శించారు. తప్పుడు ప్రకటనను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.  

అచ్చెన్నాయుడు పేరిట సర్క్యులేట్ అవుతున్న ప్రకటనలో ఏముందంటే..!
'తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. పార్టీ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి, సచివాలయ వ్యవస్థను తీసేసి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తాము. ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ వైసీపీ మనుషులే అని మనకు తెలుసు. కాబట్టి ఈ వ్యవస్థను తీసేసి కొత్తగా రాష్ట్రాన్ని నిర్మించే బాధ్యతను తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది అని హామీ ఇస్తున్నాము' అని అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.


More Telugu News