విమానంలో పొగతో బెంబేలెత్తిన ప్రయాణికులు.. అత్యవసరంగా ల్యాండింగ్

  • ఢిల్లీ-జబల్ పూర్  స్పైస్ జెట్ విమానంలో ఘటన
  • ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే పొగలు
  • వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్
ఢిల్లీ నుంచి జబల్ పూర్ వెళుతున్న స్పైస్ జెట్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా కలవరం మొదలైంది. క్యాబిన్ లో పొగలు రావడంతో ప్రమాదం జరిగిందేమోనని ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు. దీంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. 

5,000 అడుగుల ఎత్తున విమానం ప్రయాణిస్తున్న సమయంలో పొగలు వ్యాపించినట్టు స్పైస్ జెట్ అధికార ప్రతినిధి ప్రకటించారు. దీంతో విమానాన్ని పైలట్ వెనక్కి మళ్లించి ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్టు తెలిపారు. ఈ తెల్లవారుజుమాన 6.15 గంటలకు జబల్ పూర్ వెళ్లే స్పైస్ జెట్ ఎస్జీ-2862 విమానం ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకుంది. కొద్ది సేపటికే పొగలు రావడాన్ని గుర్తించారు. పైలట్ వేగంగా తన ప్రణాళికను అమలు చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

పొగలు వచ్చి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలిగినట్టు సౌరభ్ చాబ్రా అనే ప్రయాణికుడు మీడియాకు తెలిపాడు. స్పైస్ జెట్ విమానాల్లో రెండు వారాల్లో ఇది రెండో ప్రమాదం. జూన్ 19న కూడా ఇదే మాదిరి ఘటన పాట్నా-ఢిల్లీ విమాన సర్వీసులో బయటపడింది.


More Telugu News