ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్: సెంచరీతో అదరగొట్టిన పంత్.. పటిష్ఠ స్థితిలో భారత్

  • దారుణంగా విఫలమైన టీమిండియా టాపార్డర్
  • మరోమారు నిరాశపరిచిన విరాట్ కోహ్లీ
  • ఆదుకున్న పంత్, జడేజా
  • టెస్టుల్లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్న పంత్
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్ (రీషెడ్యూల్డ్ మ్యాచ్)లో తొలుత తడబడిన భారత జట్టు ఆ తర్వాత నిలదొక్కుకుంది. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్, రవీంద్ర జడేజాలు క్రీజులో పాతుకుపోయి పరుగులు రాబట్టడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. వన్డే తరహాలో బ్యాట్ ఝళిపించిన పంత్ 111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్లతో 146 పరుగులు చేసి టెస్టుల్లో ఐదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు, రవీంద్ర జడేజా కూడా ఇంగ్లిష్ బౌలర్లకు దీటుగా బదులిస్తున్నాడు. ప్రస్తుతం 83 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పంత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ 12 బంతులు ఆడి ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఏమాత్రం కలిసి రాలేదు. టాపార్డర్ దారుణంగా విఫలమైంది. శుభమన్ గిల్ (17), పుజారా (13), హనుమ విహారి (20) తీవ్రంగా నిరాశ పరిచారు. ఫామ్ లేమితో తంటాలు పడుతూ విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ కూడా దారుణంగా విఫలమయ్యాడు. కోహ్లీ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. 19 బంతులు ఆడిన విరాట్ 11 పరుగులు మాత్రమే చేసి మ్యాటీ పాట్స్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా క్రీజులో కుదురుకోలేకపోయాడు. 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా (83), మహ్మద్ షమీ క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 3, మ్యాటీ పాట్స్ 2 వికెట్లు తీసుకోగా, బెన్‌స్టోక్స్, జో రూట్‌కు చెరో వికెట్ దక్కింది.


More Telugu News