ఏకాభ్రిప్రాయంతో ఎన్నికయ్యే వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే బాగుంటుంది: మమతా బెనర్జీ

  • ద్రౌపది ముర్ముకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న మమత
  • ఆమెకు మద్దతిచ్చే విషయంలో ప్రతిపక్షాలు ఆలోచించి ఉండాల్సిందని వ్యాఖ్య
  • మహారాష్ట్రలో నెలకొన్న తాజా పరిస్థితులు కూడా ఆమెకు అనుకూలంగా మారాయన్న బెంగాల్ సీఎం
  • అకాలీదళ్ మద్దతు కూడా ద్రౌపదికే
ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయావకాశాలు ఆమెకే ఎక్కువగా ఉన్నాయన్నారు. మహారాష్ట్రలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు కూడా ముర్ముకు అనుకూలంగా మారాయని అన్నారు. ఆమెకు మద్దతిచ్చే విషయంలో ప్రతిపక్షాలు మరోమారు ఆలోచించి ఉండాల్సిందని అన్నారు. ద్రౌపదిని ఎన్‌డీఏ అభ్యర్థిగా నిలబెట్టడానికి ముందు ప్రతిపక్షాలతో బీజేపీ చర్చలు జరిపి ఉంటే బాగుండేదని మమత అభిప్రాయపడ్డారు. 

అందరి ఏకాభ్రిప్రాయంతో ఎన్నికయ్యే వ్యక్తి రాష్ట్రపతి అయితే  దేశానికి మంచిదని అన్నారు. ముర్మును నిలబెట్టడానికి ముందు తమను సలహా అడిగి ఉంటే కూడా తాము పరిశీలించి ఉండేవాళ్లమని పేర్కొన్న మమత.. ప్రతిపక్షాల నిర్ణయం ప్రకారమే తాను నడుచుకుంటానని స్పష్టం చేశారు. మరోవైపు, ద్రౌపది ముర్ముకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన శిరోమణి అకాలీదళ్ కూడా తాజాగా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించడం గమనార్హం.


More Telugu News