వర్మ్... కంప్యూటర్ వైరస్ కంటే ప్రమాదకారి.. అసలేమిటీ వర్మ్?

  • కంప్యూటర్ల పాలిట నష్టదాయకంగా మాల్వేర్లు
  • మాల్వేర్లలో రకాలే... వైరస్ లు, ట్రోజన్లు, వర్మ్ లు
  • వైరస్ కు హోస్ట్ తప్పనిసరి
  • ఎలాంటి హోస్ట్ లేకుండానే చొచ్చుకుపోయే వర్మ్
కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల యుగంలో వైరస్ లు, మాల్వేర్ల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వైరస్ కంటే ప్రమాదకారి అంటూ వర్మ్ గురించి నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. వైరస్, వర్మ్... ఇవి రెండూ కూడా మాల్వేర్ రకాలే అయినా, రెండింటికీ తేడా ఉంది. మాల్వేర్లు ఓ సిస్టమ్ లో అక్రమంగా చొరబడి అక్కడి వ్యవస్థలను తన అధీనంలోకి తెచ్చుకుని, తీవ్ర నష్టం కలుగజేస్తాయి. వైరస్ లు, ట్రోజన్లు, వర్మ్ లు మాల్వేర్లు, యాడ్వేర్ లు, స్పైవేర్లలో రకాలే. వైరస్ లో ఎంతో నష్టం కలుగజేస్తాయనుకుంటే, వర్మ్ లు అంతకంటే ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు.

వైరస్...

మాల్వేర్లో అత్యంత విరివిగా ప్రాచుర్యంలో ఉండేది ఈ వైరస్ లే. ఈ వైరస్ వ్యాప్తి చెందాలంటే ఓ ఆధారం (హోస్ట్) తప్పనిసరి. అది ఓ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ రూపంలోనో, డాక్యుమెంట్ రూపంలోనో, లేక ఏదైనా కంప్యూటర్ ప్రోగ్రామ్ రూపంలోనో ఉండొచ్చు. వైరస్ దాన్ని ఉపయోగించుకుని ఒక సిస్టమ్ మొత్తం వ్యాపిస్తుంది. తన కోడ్ ను కంప్యూటర్ ప్రోగ్రాంలోకి కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ లోకి కానీ చొప్పిస్తుంది. అనంతరం ఆ ప్రోగ్రాం/ఆపరేటింగ్ సిస్టమ్ లో మార్పులు చేసి, సిస్టమ్ లోని వ్యవస్థలను చెడగొడుతుంది. 

అయితే, ఈ వైరస్ తనంతట తాను ఏ పనీ చేయలేదు. యూజర్ ఏదైనా చర్య జరిపినప్పుడే ఇది యాక్టివేట్ అవుతుంది. యూజర్ వైరస్ సోకిన ఏదైనా ఫైల్ ను ఉపయోగించిప్పుడు మాత్రమే ఆ వైరస్ సంబంధిత వ్యవస్థకు నష్టం కలుగజేస్తుంది.

కంప్యూటర్ వర్మ్...

వైరస్ లాగానే వర్మ్ కూడా సిస్టమ్ ను నాశనం చేస్తుంది. కానీ దీనికి ఎలాంటి ఆధారం (హోస్ట్) అవసరంలేదు. ఇది స్వయం చలిత ప్రోగ్రామ్ అని చెప్పకోవచ్చు. ఇది వ్యాపించాలంటే యూజర్ ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాల్సిన అవసరంలేదు. కొన్నిసార్లు ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ లోనూ, ఎస్సెమ్మెస్ రూపంలోనూ వైరస్ లతో కూడిన ఫైళ్ల తాలూకు లింకులు వస్తుంటాయి. వీటిని మనం క్లిక్ చేస్తేనే వైరస్ లు ప్రవేశిస్తాయి. కానీ వర్మ్ అలా కాదు... ఇది మన కంప్యూటర్ లోనూ, స్మార్ట్ ఫోన్ లోనూ ప్రవేశించిందంటే చాలు... క్లిక్ చేయకుండానే తన పని ప్రారంభిస్తుంది. సిస్టమ్ లోకి ఇది ఎంటర్ అయిందంటేనే నష్టం మొదలైనట్టు భావించాలి. 

అంతేకాదు, యూజర్ చర్యలతో సంబంధం లేకుండా సిస్టమ్ అంతటా వ్యాపించడమే కాదు, ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టమ్ కు పాకుతుంది. అందుకే, వైరస్ కంటే వర్మ్ తోనే ఎక్కువ నష్టం అని సైబర్ నిపుణులు వివరిస్తున్నారు. సిస్టమ్ భద్రత వ్యవస్థలో ఏ చిన్న లోపమున్నా చాలు, ఏమాత్రం గుర్తించలేని రీతిలో వర్మ్ చొరబడుతుంది. అసలు ఇది ప్రవేశించిన విషయం కూడా తెలియదు. 

వైరస్... నెట్వర్క్ ల ద్వారా ఇతర కంప్యూటర్లలో ప్రవేశించలేదు... కానీ వర్మ్ ప్రవేశించగలుగుతుంది. వైరస్ తన సత్తా చూపించాలంటే మానవ క్రియాశీలత అవసరం. వర్మ్ కు ఆ అవసరంలేదు... తనంతట తానే పని చేసుకుపోతుంది. అందుకే, సిస్టమ్ లకు తగినంత భద్రత ఏర్పాటు చేసుకోవాలని, ఎప్పుటికప్పుడు సిస్టమ్ ను చెక్ చేస్తుండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు.



More Telugu News