మూవీ రివ్యూ: 'పక్కా కమర్షియల్'

  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'పక్కా కమర్షియల్'
  • హ్యాండ్సమ్ గా కనిపించిన గోపీచంద్ 
  • కామెడీలో ఈజ్ చూపించిన రాశి ఖన్నా 
  • రావు రమేశ్ రొటీన్ విలనిజం 
  • తగ్గిన కామెడీ పాళ్లు 
  • మారుతి మార్కుకి దూరంగా కనిపించే సినిమా  
యాక్షన్ హీరోగా గోపీచంద్ కి మంచి క్రేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతును కూడా ఆయన కూడగట్టాడు. మారుతి దర్శకత్వంలో ఆయన 'పక్కా కమర్షియల్' సినిమా చేశాడు. యూవీ - గీతా ఆర్ట్స్ 2 కలిసి నిర్మించిన ఈ సినిమాలో, గోపీచంద్ సరసన రాశి ఖన్నా నటించింది. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి కర్మ్ చావ్లా ఛాయాగ్రహకుడిగా వ్యవహరించగా, ఉద్ధవ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించాడు. మారుతి మార్క్ కామెడీ .. గోపీచంద్ తరహా యాక్షన్ ను కలుపుకుని ఈ కథ ఎలా నడిచిందనేది ఇప్పుడు చూద్దాం.

సూర్యనారాయణ (సత్యరాజ్) మంచి పేరున్న జడ్జి. వ్యాపారవేత్త అయిన వివేక్ (రావు రమేశ్) వలన అమూల్య అనే యువతికి అన్యాయం జరుగుతుంది. ఆ కేసు విషయంలో అమూల్య వైపే న్యాయం ఉందని తెలిసి కూడా ఆమెకి ప్రతికూలంగా సూర్యనారాయణ తీర్పు ఇస్తాడు. దాంతో అమూల్య ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఆమె మరణానికి కారణం తానే కావడంతో, ఆయన న్యాయస్థానానికి దూరమవుతాడు. ఆయన తనయుడు లక్కీ (గోపీచంద్) లాయర్ అవుతాడు. అయితే ఆయన పద్ధతి తండ్రికి పూర్తి విరుద్ధం. 

ఫీజులు ఇచ్చుకోలేకని వాళ్ల తరఫున వాదించడం వలన ప్రయోజనం ఉండదు. కాసులు .. కానుకలు ఇచ్చే కేసులను మాత్రమే ఆయన టేకప్ చేస్తుంటాడు. అయితే తాను పక్కా కమర్షియల్ అనే విషయం తండ్రికి తెలియకుండా జాగ్రత్తపడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి సీరియల్ ఆర్టిస్ట్ శిరీష (రాశి ఖన్నా)తో పరిచయం ఏర్పడుతుంది. కొన్ని కారణాల వలన ఆమె ఆయనకి అసిస్టెంట్ గా చేరుతుంది. అదే వాళ్లు లవ్ లో పడటానికి కారణమవుతుంది. వివేక్  కి సంబంధించిన ఒక కేసును లక్కీ వాదించి గెలుస్తాడు. 

అమూల్య జీవితాన్ని నాశనం చేసింది వివేక్. అతని కారణంగానే ఆమె చనిపోయింది. ఆ సంఘటన కారణంగానే తాను నల్లకోటును వదులుకున్నది .. న్యాయస్థానానికి దూరమైంది. అలాంటి వివేక్ ను డబ్బుకోసం తన కొడుకు గెలిపించాడు .. అందుకోసం అవినీతిని ఆశ్రయించాడు. అందువలన వివేక్ తో పాటు తన కొడుకును కూడా సవాల్ చేస్తూ సూర్యనారాయణ మళ్లీ నల్లకోటును ధరించి న్యాయస్థానంలో అడుగుపెడతాడు. ఆ తరువాత ఏం జరుగుతుంది? న్యాయస్థానం సాక్షిగా తండ్రీకొడుకులలో ఎవరు గెలిచారు? అనేదే కథ.  

దర్శకుడు మారుతి ఈ కథలో సత్యరాజ్ పాత్రను సీరియస్ గా .. గోపీచంద్ పాత్రను కామెడీ టచ్ తో నడిపించాడు. సత్యరాజ్ పాత్రలో నిజాయితీ కంటే నిస్సహాయత ఎక్కువగా కనిపించింది. గోపీచంద్ పాత్రకి కామెడీ కోటింగును పెంచుతూనే ఆయన నుంచి ఆడియన్స్ ఆశించే యాక్షన్ మిస్ కాకుండా చూసుకున్నాడు. అలాగే విలన్ గా రావు రమేశ్ పాత్రను ఆయన స్టయిల్లోనే నడిపించాడు. ఆ పాత్రకి ఏదైనా మేనరిజం పెడితే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇక సీరియల్ ఆర్టిస్టుగా .. లాయర్ పాత్ర కోసం 'లా' చేశానని చెప్పే రాశి ఖన్నా పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు బాగుంది. 

పాత సినిమాల నుంచి తీసుకుంటే .. కోర్టు రూమ్ సీన్స్ ప్రధానంగా నడిచే కథలు .. ఎంటర్టైనమెంట్ ఒక ఒరలో ఇమడవు అనే విషయం అర్థమవుతుంది. కానీ ఈ సినిమాలో మారుతి అలాంటి ఒక ప్రయత్నమే చేశాడు. ఆయన ప్రయత్నం కొంతవరకే సక్సెస్ అయిందని చెప్పాలి. టీవీలో 'సంసారం ఒక చదరంగం' సినిమా చూసి, అందులో మాదిరిగా ఇంటి మధ్యలో గీత గీయడం, కమర్షియల్ .. నాన్ కమర్షియల్ బోర్డులు పెట్టుకుని కేసులు చూడటం .. సీరియస్ గా కేసు పెట్టడానికి వచ్చినవాళ్లు డబ్బుకు ఆశపడి 'గీత' దాటడం సరైన కామెడీ కంటెంట్ గా అనిపించదు. రాశి ఖన్నాకి సంబంధించిన కొన్ని సీన్స్ కూడా అంతే.

గోపీచంద్ ను స్టైలీష్ గా .. హ్యాండ్సమ్ గా చూపించడంలోను .. రాశి ఖన్నాను మరింత గ్లామరస్ గా చూపించడంలోనూ మారుతి సక్సెస్ అయ్యాడు. ఇద్దరూ తమకి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. గోపీచంద్ తన స్వభావానికి భిన్నమైన బాడీ లాంగ్వేజ్ ను కనబరచడానికి బాగానే కష్టపడ్డాడు. రాశి ఖన్నా కామెడీలో మంచి ఈజ్ చూపించింది. ఇక సత్యరాజ్ .. రావు రమేశ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక తన లవర్ ను వివేక్ వలలో వేసుకున్నాడనే ఉక్రోషంతో రగిలిపోయే దివాకరం పాత్రలో అజయ్ ఘోష్ నవ్వించాడు. వరలక్ష్మి శరత్ కుమార్ చివర్లో మెరిసింది. 

మారుతి రాసుకున్న ఈ కథ కొత్తదేం కాదు .. కొత్తదనమూ లేదు. స్క్రీన్ ప్లే అంత పట్టుగా .. పకడ్బందీగా ఏమీ అనిపించదు. లవ్ ..  ఫ్యామిలీ ఎమోషన్స్ పాళ్లు తక్కువ. యాక్షన్ వరకూ ఓకే .. కామెడీలో కాస్త అల్లరి చిల్లరితనం ఎక్కువగా కనిపిస్తుంది. జేక్స్ బిజోయ్ బాణీలు ఓ మాదిరిగా అనిపిస్తాయి. సెకండాఫ్ లో వచ్చే ఒక పాటను మ్యూజిక్ డామినేట్ చేసింది .. సాహిత్యం అర్థం కాదు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే .. సన్నివేశాలతో సంబంధం లేకుండా సాగిపోతుంది. ఎడిటింగ్ ఓ మాదిరి అనిపిస్తుంది. ఇక పాటలు .. సన్నివేశాల చిత్రీకరణ విషయంలో కెమెరా పనితననానికి ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చు. 

మారుతి చాలా సింపుల్ లైన్ తీసుకుని దానిని చాలా బాగా డెవలప్ చేస్తుంటాడు. తక్కువ బడ్జెట్ లోనే పెద్ద సినిమా అనే ఫీల్ ను తీసుకొస్తుంటాడు. నిర్మాణ విలువల పరంగా ఈ సినిమా కూడా అలాగే అనిపిస్తుంది. కాకపోతే కథాకథనాల పరంగా .. సంభాషణల పరంగా .. కామెడీ పరంగా ఇది మారుతి మార్క్ కి కాస్త దూరంగా కనిపిస్తుంది. తెరపై హీరోను చూసిన ప్రేక్షకుడు, "వామ్మో ఇంత 'పక్కా కమర్షియల్' గా ఉండేవాడిని నేను ఇంతవరకూ చూడలేదు" అని మాత్రం అనుకోడు. ఎందుకంటే ఆ రేంజ్ సీన్స్ ను మారుతి రాసుకోలేదు. హీరో చేసే ప్రతి పని క్లైమాక్స్ తో ముడిపడి ఉండటం వలన, ఆ పాత్రను ఆశించిన స్థాయిలో ఆయన డిజైన్ చేయలేకపోయాడనే విషయం మాత్రం అర్థమవుతుంది.

--- పెద్దింటి గోపీకృష్ణ


More Telugu News