మూడు శాతం పెరిగిన బంగారం ధరలు.. కేంద్రం దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్!

  • 7.5 నుంచి 12.5 శాతానికి పెంచిన కేంద్రం
  • రూపాయి విలువ పడిపోవడంతో సమస్య
  • వాణిజ్య లోటు తగ్గించుకోవడం కోసం సుంకం పెంపు
దేశంలో బంగారం ధరలు పెరగనున్నాయి. మన దేశానికి బంగారం దిగుమతులు పెరిగిపోతుండటం, అదే సమయంలో వాణిజ్య లోటు ఏర్పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం పెంచింది. ప్రస్తుతమున్న 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. దీనిని జూన్ 30వ తేదీ నుంచే అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. దీనికితోడు ఇప్పటికే బంగారంపై ఉన్న 2.5 శాతం అగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సెస్, మూడు శాతం జీఎస్టీ కూడా వర్తిస్తుంది.

మూడు శాతం పెరిగాయి
దిగుమతి సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు మూడు శాతం పెరిగాయి. హోల్ సేలర్లతోపాటు రిటైల్ ఆభరణాల విక్రేతలు ధరలను పెంచేశారు. ఇది వినియోగదారులకు భారంగా మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు అర శాతం తగ్గడం గమనార్హం.

రూపాయి విలువ పడిపోవడంతో..
అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకూ పడిపోతోంది. దేశం నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతుండడంతోపాటు బంగారం వంటి వాటి దిగుమతులు పెరుగుతున్నాయి. ముడి చమురు ధరలు చుక్కలను తాకుతున్నాయి. వీటన్నింటి డాలర్లకు డిమాండ్ పెరిగిపోయి.. రూపాయి విలువ తగ్గిపోతోంది. విదేశ దిగుమతులకు డాలర్లలో చెల్లింపులు చేయాల్సిన పరిస్థితుల్లో.. ఎక్కువ సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే బంగారం కొనుగోళ్లను నిరుత్సాహపర్చడం, తద్వారా దిగుమతులను తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచింది. 



More Telugu News