షిండే సీఎం కాగానే శరద్ పవార్ కు షాక్!

  • పవార్ కు నిన్న రాత్రి ఐటీ నోటీసులు
  • లవ్ లెటర్ అందిందన్న పవార్
  • ఐటీ నోటీసులకు భయపడనన్న ఎన్సీపీ అధినేత
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ముగిసింది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన రెబెల్స్ నేత ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్న రాత్రి ప్రమాణస్వీకారం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన వెంటనే... ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు తొలి షాక్ తగిలింది. నిన్న రాత్రి ఆయనకు ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయి. ఈ విషయాన్ని శరద్ పవార్ ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. 

తనకు ప్రేమలేఖ అందిందని పవార్ ట్వీట్ చేశారు. 2004, 2009, 2014, 2020లలో జరిగిన ఎన్నికల్లో తాను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఐటీ శాఖ నుంచి తనకు ప్రేమలేఖ అందిందని చెప్పారు. కొందరు వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారని... రాజకీయ కుట్రల్లో భాగంగానే ఇది జరుగుతోందని అన్నారు. ఐటీ నోటీసులకు తాను భయపడనని... అఫిడవిట్లకు సంబంధించిన సమాచారమంతా తన వద్ద ఉందని చెప్పారు. 

హిందుత్వ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్, ఎన్సీపీలతో ఉద్ధవ్ థాకరే చేతులు కలిపారంటూ ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలపై పవార్ స్పందిస్తూ... హిందుత్వ సిద్ధాంతం కోసం షిండే తిరుగుబాటు చేయలేదని... అధికారం కోసం ఆ పని చేశారని విమర్శించారు. 

మరోవైపు, శివసేనకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు షిండేతో పాటు బయటకు వచ్చేశారు. దీంతో, తన సొంత పార్టీ (శివసేన)లో ఉద్ధవ్ థాకరే మైనార్టీగా మిగిలిపోయారు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని చెప్పడానికి ఇది మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు.


More Telugu News