ప్రపంచ అతిపెద్ద చాకొలేట్ తయారీ కర్మాగారంలో బ్యాక్టీరియా కలకలం

  • చాక్లెట్ రంగంలో అగ్రగామిగా బారీ కాలెబాట్
  • బెల్జియంలోని వీజ్ పట్టణంలో భారీ కర్మాగారం
  • నెస్లే, హెర్షీ, మాండలెజ్ వంటి కంపెనీలకు లిక్విడ్ చాక్లెట్ సరఫరా
  • ఇటీవల సాల్మొనెల్లా బ్యాక్టీరియా గుర్తింపు
స్విట్జర్లాండ్ కు చెందిన దిగ్గజ చాక్లెట్ తయారీ సంస్థ బారీ కాలెబాట్ కు బెల్జియం దేశంలోని వీజ్ పట్టణంలో ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ తయారీ కర్మాగారం ఉంది. అయతే, ఈ ఫ్యాక్టరీలో బ్యాక్టీరియా కలకలం రేగింది. ప్రమాదకర బ్యాక్టీరియా సాల్మొనెల్లా ఆనవాళ్లు గుర్తించడంతో ఈ భారీ చాక్లెట్ ఫ్యాక్టరీని మూసివేశారు. 

దీనిపై బారీ కాలెబాట్ ప్రతినిధి కొర్నీల్ వార్లాప్ స్పందిస్తూ, ప్రస్తుతం కర్మాగారంలో ఉత్పత్తి నిలిపివేశామని వెల్లడించారు. బ్యాక్టీరియా కలుషిత చాక్లెట్ పదార్థాన్ని అందుకున్న తమ వినియోగదారులను ఇప్పటికే సంప్రదించామని, తదుపరి ప్రకటన చేసేంతవరకు వీజ్ పట్టణంలో చాక్లెట్ తయారీ నిలిపివేశామని వార్లాప్ వివరించారు. 

అయితే, బ్యాక్టీరియా ఆనవాళ్లు గుర్తించిన చాక్లెట్ పదార్థంలో అత్యధిక భాగం వీజ్ లోని తమ ప్లాంట్ లోనే ఉందని వెల్లడించారు. ముందు జాగ్రత్తగా తమ కస్టమర్ సంస్థలను అప్రమత్తం చేశామని, జూన్ 25 నుంచి అందిన సరుకుతో తయారైన చాక్లెట్ ఉత్పత్తులను ఎగుమతి చేయొద్దని సూచించామని తెలిపారు.

ఈ విశాలమైన యూనిట్ లో ద్రవరూప చాక్లెట్ ను ఉత్పత్తి చేస్తారు. వివిధ రూపాల్లో చాక్లెట్లు తయారుచేసే 73 కంపెనీలకు ఈ ద్రవరూప చాక్లెట్ ను సరఫరా చేస్తారు. అయితే, ఈ సంస్థ నుంచి లిక్విడ్ చాక్లెట్ అందుకున్న ఫెర్రెరో ఫ్యాక్టరీలో పెద్ద సంఖ్యలో చాక్లెట్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియాను గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బెల్జియంకు చెందిన ఫెర్రెరో సంస్థ కిండర్ బ్రాండ్ తో చాక్లెట్లు తయారుచేస్తుంది. 

తాజాగా సాల్మోనెల్లా బ్యాక్టీరియా వెలుగుచూసిన నేపథ్యంలో, ఇటీవల కాలంలో సరఫరా చేసిన చాక్లెట్ ను, తయారైన అనుబంధ ఉత్పత్తులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. బారీ కాలెబాట్ సంస్థ నుంచి ద్రవరూప చాక్లెట్ ను అనేక దిగ్గజ సంస్థలు కొనుగోలు చేస్తుంటాయి. వాటిలో నెస్లే, హెర్షీ, మాండెలజ్ వంటి కంపెనీలు ఉన్నాయి. 

2020-21 సీజన్ లో 2.2 మిలియన్ టన్నుల చాక్లెట్ విక్రయంతో బారీ కాలెబాట్ ఈ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 60 ఉత్పాదక కేంద్రాలు ఉండగా, 13 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.


More Telugu News