ఉపవాసంలో కాఫీ తాగడం మంచిది కాదు.. సమస్యలేమిటో తెలుసా?

  • శరీరంలో ఎసిడిటీ సమస్య పెరుగుతుందని నిపుణుల హెచ్చరిక
  • కెఫీన్ మరీ ఎక్కువైతే హార్మోన్ల అసమతుల్యత
  • గ్యాస్, డయేరియా వంటి ఇబ్బందులూ వస్తాయని వెల్లడి
ఉపవాసం ఆరోగ్యానికి చాలా మంచిది. వారానికి ఒకటి రెండు రోజులు ఉపవాసం ఉండడం వల్ల శరీరం పునరుత్తేజితం అవుతుందని వైద్యులు కూడా చెప్తుంటారు. అయితే ఉపవాసం ఉన్నాం కదా అని కొందరు అదే పనిగా మధ్య మధ్యలో కాఫీలు తాగుతుంటారు. ఇది మంచిదికాదని, అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ మొత్తంలో ఒకట్రెండు సార్లు కాఫీ తాగవచ్చని, కానీ పరిమితి దాటితే మాత్రం ఇబ్బందులు తప్పవని స్పష్టం చేస్తున్నారు.

కొన్ని ప్రయోజనాలున్నా..
కాఫీ ఆకలిని కొంత సమయం పాటు తొక్కి పెడుతుందని పోషకాహార నిపుణుడు లవ్ నీత్ బాత్రా చెప్తున్నారు. కానీ అది కొద్ది మొత్తాల్లో అయితే ఫరవాలేదని అంటున్నారు. అయితే ఉపవాసం సమయంలో, ముఖ్యంగా 12–14 గంటల పాటు ఏమీ తినకుండా ఉండే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో కాఫీ తాగడం ఇబ్బందులు తెచ్చి పెడుతుందని హెచ్చరిస్తున్నారు. దీనికి కాఫీలో ఉండే కెఫైన్ కారణమని వివరిస్తున్నారు.

ఏమేం సమస్యలు వస్తాయి? ఎవరెవరు దూరంగా ఉండాలి?

  • ఎసిడిటీ: మన గొంతులోని ఆహార నాళం, జీర్ణాశయం కలుసుకునే చోట ఉండే కండరాలను కెఫైన్ వదులు చేస్తుంది. దీనివల్ల జీర్ణాశయంలోని ఏసిడ్ పైకి వచ్చి ఛాతీలో మంట మొదలవుతుంది. దీనినే ‘గ్యాస్ట్రోసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్’ అంటారు.
  • తీవ్ర ఉద్వేగం: ఎవరైనా తీవ్ర ఉద్వేగంతో, ఉద్రేక పరిస్థితుల్లో ఉంటే కాఫీ దానిని మరింత పెంచుతుంది. ముఖ్యంగా ఉపవాసం సమయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వారు కాఫీకి దూరంగా ఉండటం మంచిది.
  • గుండె జబ్బులు: గుండె జబ్బులు ఉన్నవారు కూడా ఉపవాసం పాటిస్తున్నప్పుడు కాఫీకి దూరంగా ఉండాలి. ఎందుకంటే కెఫైన్ రక్తపోటును, గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు కూడా కాఫీకి దూరంగా ఉండాలి.
  • హార్మోన్ల అసమతుల్యత: ఎక్కువగా కెఫైన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయులు పెరుగుతాయి. దీనివల్ల ప్రొజెస్టిరాన్–ఈస్ట్రోజన్ హార్మోన్ల మధ్య అసమతుల్యత ఏర్పడి.. పలు రకాల ఇబ్బందులు తలెత్తుతాయి.
  • థైరాయిడ్ సమస్యలు: థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నవారు, దానికి మందులు వాడుతున్నవారు కాఫీకి దూరంగా ఉండటం మంచిది. ఇది వారి సమస్య పెరిగేందుకు కారణమవుతుంది. థైరాయిడ్ మందులను శరీరం సరిగా శోషించుకోలేకపోతుంది.
  • జీర్ణాశయ సమస్యలు: జీర్ణాశయంలో ఆహార కదలికలకు కీలకమైన గ్యాస్ట్రిన్ హార్మోన్ ఉత్పత్తిని కెఫైన్ ప్రేరేపిస్తుంది. అందువల్లే కొందరు కాఫీ తాగగానే టాయిలెట్ కు వెళ్తుంటారు. ఇక కెఫైన్ తో ఇతర జీర్ణ రసాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇది డయేరియా, ఇరిటిబుల్ బొవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలకు కారణమవుతుంది.



More Telugu News