‘సాలు దొర సెలవు దొర’.. ‘సాలు మోదీ సంపకు మోదీ’.. బీజేపీ-టీఆర్ఎస్ పోస్టర్ల పోరు

  • నగరవ్యాప్తంగా పలు కూడళ్లలో ఏర్పాటు
  • జులై 2 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
  • దీంతో ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీజేపీ
  • తగ్గేదే లేదంటున్న టీఆర్ఎస్
  • చలానాలు విధిస్తున్న జీహెచ్ఎంసీ
భాగ్యనగరంలో జులై 2 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదలు కానున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, దేశం నలుమూలల నుంచి ప్రముఖ బీజేపీ నేతలు హాజరు కానున్నారు. బీజేపీ తెలంగాణ శాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసింది. 

ఇందులో భాగంగా టీఆర్ఎస్ సర్కారును లక్ష్యంగా చేసుకుని నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ‘సాలు దొర సెలవు దొర’ అంటూ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన ఫొటోతో క్యాప్షన్ రాసి పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద డిజిటల్ డిస్ ప్లే ఏర్పాటు చేసింది. కల్వకుంట్ల కౌంట్ డౌన్ అంటూ రోజులు, సమయం కూడా చూపిస్తోంది. దీనికితోడు నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే మాదిరి పోస్టర్లతో నింపేసింది. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో అధికారంపై బీజేపీలో ఎంతో ధీమా కనిపిస్తోంది.

అటు టీఆర్ఎస్ కూడా తగ్గదే లేదన్నట్టు.. ‘సాలు మోదీ సంపకు మోదీ’ పేరుతో పోటీ హోర్డింగ్ లు పెట్టేసింది. పక్కనే మోదీ సర్కారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను విమర్శిస్తూ క్యాప్షన్లు రాసింది. ‘రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపినవ్’, 'హటాత్తుగా లాక్ డౌన్ పెట్టి గరీబోళ్లను చంపినవ్’, 'నాలుగు సంవత్సరాల కాంట్రాక్టు ఉద్యోగాలు మాత్రమే అని యువత కడుపు కొట్టినవ్’ అంటూ పలు క్యాప్షన్లు రాసింది. కింది భాగంలో బైబై మోదీ అని రాసి ఉండడం కనిపించింది. 

వీటిని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేశారు. వీటిని చూసిన వాహనదారులు సరదాగా నవ్వుకుంటున్నారు. రెండు పార్టీల మధ్య కొంత కాలంగా విమర్శలు తార స్థాయికి చేరడం తెలిసిందే. అటు సోషల్ మీడియాలోనూ ఇరు పార్టీల మధ్య విమర్శలు వేడెక్కాయి. మరోవైపు బీజేపీపై అధికార టీఆర్ఎస్ సర్కారు పరోక్ష చర్యలకు సైతం దిగింది. అనుమతి లేదని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిస్ ప్లే ను జీహెచ్ఎంసీ తొలగించింది. నగరవ్యాప్తంగా బృందాలు తిరుగుతూ అనుమతి లేకుండా పెట్టిన హోర్డింగ్ లు, కటౌట్లకు చలానాలు విధిస్తున్నాయి.


More Telugu News