క్రికెటర్ కేఎల్ రాహుల్ కు జర్మనీలో సర్జరీ పూర్తి

  • గజ్జల్లో గాయానికి శస్త్రచికిత్స
  • విజయవంతమైనట్టు ప్రకటించిన రాహుల్
  • రికవరీ బాగుందంటూ ట్వీట్, ఫొటో షేర్
టీమిండియా క్రికెటర్, లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కు జర్మనీ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. తన పరిస్థితి కుదుటపడుతున్నట్టు స్వయంగా రాహుల్ తెలిపాడు. అతడికి గజ్జ భాగంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించాల్సిన రాహుల్ ఉన్నట్టుండి గాయంతో తప్పుకోవడం తెలిసిందే. 

‘‘అందరికీ హెలో.. కొన్ని వారాల నుంచి కష్టంగా ఉంది. కానీ సర్జరీ విజయవంతమైంది. నా గాయం మానుతోంది. చక్కగా కోలుకుంటున్నాను. కోలుకునే క్రమం మొదలైంది. మీ సందేశాలకు, ప్రార్థనలకు ధన్యుడను. త్వరలోనే మీ అందరినీ చూస్తాను’’ అంటూ ట్విట్టర్ లో రాహుల్ పోస్ట్ పెడుతూ, తాను ఆసుపత్రి బెడ్ పై నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేశాడు. 

మరోవైపు ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ కు అటు రోహిత్, ఇటు రాహుల్ అందుబాటులో లేకపోవడం యాదృచ్ఛికమే. రోహిత్ కూడా గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో జులై 1 నుంచి మొదలయ్యే టెస్ట్ మ్యాచ్ లో శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. రోహిత్, రాహుల్ తిరిగి అందుబాటులోకి వస్తే టీమిండియా అన్ని ఫార్మాట్లలో గాడిన పడే అవకాశం ఉంటుంది. 




More Telugu News