తెలంగాణ ప్రభుత్వ బడుల్లో ఇక రోజూ యోగా, ధ్యానం

  • విద్యార్థుల్లో ఆందోళన, ఒత్తిడి దూరం చేసేందుకు నిర్ణయం
  • 2022-2023 అకడమిక్ క్యాలెండర్లో చేర్చిన విద్యాశాఖ
  • ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 230 పని దినాలు
విద్యార్థుల్లో ఆందోళన, ఒత్తిడిని దూరం చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు బడిలో  ప్రతి రోజూ 5 నిమిషాల పాటు యోగా లేదా ధ్యానం చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్లో యోగా, ధ్యానం కూడా చేర్చారు.  నెలలో ప్రతి మూడో శనివారంను ' నో బ్యాగ్‌ డే'గా పాటిస్తారు. ఆ రోజు విద్యార్థులంతా పుస్తకాలు, నోటుబుక్స్‌ లేకుండా పాఠశాలకు రావాల్సి ఉంటుంది. ఆ రోజున బడుల్లో బాలసభను నిర్వహిస్తారు. 

అలాగే,  ప్రతి నెలా నాలుగో శనివారం స్వచ్ఛ స్కూల్/ హరితహారం చేపట్టాలని  2022--23 విద్యా సంవత్సరం  క్యాలెండర్‌లో స్పష్టం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరిచేందుకు, పాఠశాలలు అన్ని తరగతులకు ఆంగ్లంలో కమ్యూనికేటివ్ స్కిల్స్ కోసం వారంలో ఒక పీరియడ్‌ను కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో ఆంగ్లంలో వార్తాపత్రిక చదవడం, కథలు చెప్పడం, కథల పుస్తక పఠనం, డ్రామా/స్కిట్ మొదలైనవి చేర్చారు. 

     ఈ విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పది తరగతులకు 230 పనిదినాలు ఉంటాయి.  జూన్ 13 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 24 వరకూ విద్యాసంవత్సరం ఉంటుందని విద్యాశాఖ వెల్లడించింది.  దసరాకు 14 రోజులు, సంక్రాంతికి 5 రోజులు ఇచ్చింది. మిషనరీ స్కూల్స్‌లో 7 రోజుల క్రిస్మస్‌ సెలవులు ఇవ్వాలని   నిర్ణయించింది. దీని ప్రకారం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 22 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులు (మిషనరీ స్కూళ్లకు మాత్రమే), 2023 జనవరి 13 నుంచి 17 వరకూ సంక్రాంతి సెలవులు (నాన్ మిషనరీ స్కూల్స్కు స్కూళ్లకు మాత్రమే) ఉంటాయి. 
    
 2023 ఏప్రిల్‌ 24 వరకు పాఠశాలలు నిర్వహించి, ఏప్రిల్‌ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తారు. పదో తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలను ఫిబ్రవరిలో, వార్షిక పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు.  పదో తరగతి సిలబస్ ను జనవరి 10లోపు,  ఒకటి నుంచి 9 వరకు తరగతుల సిలబస్ ను ఫిబ్రవరి 28 వరకూ పూర్తి చేస్తారు.  

 ఫార్మటీవ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)1 పరీక్షలను జులై 21లోగా, ఎఫ్ఏ2 పరీక్షలను సెప్టెంబర్ 5లోగా, ఎఫ్ఏ3 పరీక్షలను డిసెంబర్ 21లోపు పూర్తి చేయాలని నిర్ణయించింది.   ఎఫ్ఏ 4 పరీక్షలను పదో తరగతి విద్యార్థులకు  జనవరి 31లోపు, 9వ తరగతి వరకూ ఫిబ్రవరి 28 లోపు పూర్తి చేయాలి.   సమ్మెటీవ్ అసెస్మెంట్ (ఎస్ఏ)–1 పరీక్షలు నవంబర్ 1 నుంచి 7 వరకూ, ఎస్ఏ2 పరీక్షలు తొమ్మిదో తరగతి వరకు ఏప్రిల్ 10 నుంచి 17 వరకు జరుగుతాయి. పదో తరగతి  ఫ్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 28లోపు నిర్వహించాలి. 


More Telugu News