'మ‌హా' బ‌లప‌రీక్ష‌కు గ్రీన్ సిగ్న‌ల్.. గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు

  • మూడున్నర గంటలపాటు వాదనలు 
  • శివ‌సేన పిటిష‌న్‌ను తోసిపుచ్చిన సుప్రీం 
  • గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఉద్ధ‌వ్ బ‌ల ప‌రీక్ష‌
  • అన‌ర్హ‌త నోటీసులు జారీ అయిన 16 మంది ఎమ్మెల్యేల‌కు ఓటు హ‌క్కు
మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం ముగింపున‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే బ‌ల ప‌రీక్ష‌కు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఫ‌లితంగా గురువారం మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే అసెంబ్లీలో త‌న బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున్న అసెంబ్లీలో ఉద్ధ‌వ్ థాక‌రే బ‌ల ప‌రీక్ష‌ను ఎదుర్కోనున్నారు. ఈ మేర‌కు బుధ‌వారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు చెప్పింది.

ఉద్ధ‌వ్ థాక‌రే బ‌ల ప‌రీక్ష‌కు సంబంధించి శివ‌సేన దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై బుధ‌వారం సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 8.30 గంట‌ల దాకా సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాద‌న‌లు కొన‌సాగాయి. శివ‌సేన‌, మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌, శివ‌సేన రెబ‌ల్ నేత ఏక్‌నాథ్ షిండే త‌ర‌ఫున ముగ్గురు సీనియ‌ర్ న్యాయ‌వాదులు త‌మ వాద‌న‌ల‌ను వినిపించారు. దాదాపుగా 3.30 గంట‌ల పాటు వాద‌న‌లు విన్న సుప్రీంకోర్టు... అర‌గంట విరామం తీసుకుని రాత్రి 9 గంట‌ల‌కు త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. 

ఉద్ధ‌వ్ థాక‌రే బ‌ల ప‌రీక్ష‌ను వాయిదా వేయాలంటూ శివ‌సేన చేసిన విజ్ఞ‌ప్తిని సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది. అదే స‌మ‌యంలో బ‌ల ప‌రీక్ష‌కు ఆదేశించిన గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స‌మ‌ర్ధించింది. అంతేకాకుండా డిప్యూటీ స్పీక‌ర్ అనర్హ‌త నోటీసులు జారీ చేసిన 16 మంది ఎమ్మెల్యేలు బ‌ల ప‌రీక్ష‌లో పాలుపంచుకునేందుకు కూడా కోర్టు అనుమ‌తించింది.


More Telugu News