శివ‌సేన‌కు మ‌రో షాక్‌.. ఉద్ధ‌వ్‌పై అవిశ్వాస‌ తీర్మానానికి రాజ్ థాక‌రే మ‌ద్దతు

  • ఎంఎన్ఎస్‌కు మ‌హారాష్ట్ర అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే
  • రాజ్ థాక‌రే మ‌ద్ద‌తు కోరిన ఫ‌డ్న‌వీస్‌
  • సానుకూలంగా స్పందించిన రాజ్ థాక‌రే
మ‌హారాష్ట్రలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం బుధ‌వారం మ‌రో కీల‌క మ‌లుపు తిరిగింది. శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ థాక‌రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై ప్ర‌వేశ‌పెట్ట‌నున్న అవిశ్వాస తీర్మానానికి మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ  సేన (ఎంఎన్ఎస్‌) మ‌ద్ద‌తు ప‌లికింది. ఈ మేర‌కు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక‌రే బుధ‌వారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. బీజేపీ, షిండే వ‌ర్గాల‌తో కూడిన కూటమికి ఆయ‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

ఉద్ధ‌వ్ థాక‌రే ప్ర‌భుత్వం బ‌ల ప‌రీక్ష నిర్వ‌హించాలంటూ మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో గురువారం మ‌హారాష్ట్ర అసెంబ్లీ ప్ర‌త్యేకంగా స‌మావేశం కానుంది. ఈ నేప‌థ్యంలో షిండే వ‌ర్గం ఎమ్మెల్యేల‌తో క‌లుపుకుంటే... బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్న‌ట్లే లెక్క‌. 

మరోపక్క, మ‌హారాష్ట్ర అసెంబ్లీలో విప‌క్ష నేత‌గా ఉన్న మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ బుధ‌వారం రాజ్ థాక‌రేకు ఫోన్ చేసి మ‌ద్ద‌తు కోరారు. ఫ‌డ్న‌వీస్ అభ్య‌ర్థ‌న‌కు రాజ్ థాక‌రే మ‌రో మాట లేకుం‌డానే ఒప్పేసుకున్నారు. త‌న పార్టీకి అసెంబ్లీలో ఉన్న ఏకైక అభ్య‌ర్థి బీజేపీ, షిండే వ‌ర్గం కూట‌మికే మ‌ద్ద‌తు తెలుపుతారంటూ ఆయ‌న ప్ర‌క‌టించారు.


More Telugu News